ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన అడ్మిషన్లు

Jul 3 2026 10:56 AM | Updated on Jul 3 2026 10:56 AM

తల్లిదండ్రులకు నమ్మకం పెరిగింది

గతేడాదితో పోలిస్తే

విద్యార్థుల సంఖ్య అధికం

నాణ్యమైన విద్య, మెరుగైన

వసతులే కారణం

సత్ఫలితాలు ఇచ్చిన

బడిబాట కార్యక్రమం

సూర్యాపేట టౌన్‌ : సర్కారు బడులపై తల్లిదండ్రుల్లో నమ్మకం రోజురోజుకూ బలపడుతోంది. కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడడం, నాణ్యమైన విద్య అందుతుండడంతో ఈ విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు భారీగా పెరిగాయి. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలతోపాటు మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. దీనికి తోడు ఉపాధ్యాయులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీబడిబాటశ్రీ కార్యక్రమం క్షేత్రస్థాయిలో అద్భుతమైన సత్ఫలితాలను ఇచ్చింది. ఈ సానుకూల మార్పుల వల్ల జిల్లాలో గతంలో మూతబడిన 15 పాఠశాలలు ఈ ఏడాది తిరిగి తెరుచుకోవడం విశేషం.

అదనంగా చేరింది 3306 మంది

గత విద్యాసంవత్సరంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమం ద్వారా మొత్తం 5,272 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరగా, ఈ విద్యా సంవత్సరంలో జూన్‌ 19 నాటికే ఆ సంఖ్య ఏకంగా 8,578 కి చేరింది. గతేడాదితో పోలిస్తే ఈసారి 3306 మంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు. ప్రభుత్వ విద్యపై ప్రజల్లో వస్తున్న సానుకూల మార్పునకు ఈ గణాంకాలే నిదర్శనం.

మెరుగైన వసతులు..

ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు కల్పించడం, ఆంగ్ల మాధ్యమ బోధన, డిజిటల్‌ తరగతుల నిర్వహణ, పరిశుభ్రమైన వాతావరణం, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన బోధన అందించడం వంటి చర్యలు తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంచాయి. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఏటా ఫీజుల భారం పెరుగుతుండడంతో.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా లభిస్తున్న నాణ్యమైన విద్య వైపు పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు.

కోదాడ మండలంలో అత్యధికంగా..

జిల్లాలో మొత్తం 950 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిలో 182 ఉన్నత, 78 ప్రాథమికోన్నత, 690 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. దాంతో పాటు తొమ్మిది మోడల్‌ స్కూల్స్‌, 18 కేజీబీవీలు ఉన్నాయి. బడిబాట కార్యక్రమంలో భాగంగా అత్యధికంగా కోదాడ మండలంలో 1,016 అడ్మిషన్లు వచ్చాయి. అత్యల్పంగా మఠంపల్లి మండలంలో 53 అడ్మిషన్లు మాత్రమే వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఒకటవ తరగతిలో 2150 అడ్మిషన్లు అయ్యాయి. ప్రైవేట్‌ పాఠశాలల నుంచి 1,584 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు.

అడ్మిషన్లు ఇలా..

గత ఏడాది బడిబాటలో అడ్మిషన్లు: 5,272

ఈ ఏడాది ఇప్పటివరకు అడ్మిషన్లు: 8578

అదనంగా చేరిన విద్యార్థులు : 3306

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, ఇతర వసతులు కల్పించడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగింది. ఈ ఏడాది అడ్మిషన్లు గత ఏడాది కంటే ఎక్కువగా వచ్చాయి. బడిబాటలో ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులపై వివరించారు. –అశోక్‌, డీఈఓ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement