నేడు మంత్రి ఉత్తమ్‌ పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి ఉత్తమ్‌ పర్యటన

Jul 3 2026 10:56 AM | Updated on Jul 3 2026 10:56 AM

హుజూర్‌నగర్‌ : రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌ నుంచి ఉదయం 10:30 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 11:20 గంటలకు హుజూర్‌నగర్‌లోని డిగ్రీ కాలేజీలో గల హెలీప్యాడ్‌లో దిగుతారు. అక్కడ నుంచి రోడ్డుమార్గం ద్వారా గరిడేపల్లి మండలంలోని కల్మలచెరువు చేరుకుని.. అక్కడ వివిధ గ్రామాల రోడ్డు పనులను మంత్రి ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం గడ్డిపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ పనులను మంత్రి పరిశీలిస్తారు. తదుపరి హుజూర్‌నగర్‌ పరిధిలో నిర్మాణంలో ఉన్న మోడల్‌ కాలనీ, జూనియర్‌, డిగ్రీ, కాలేజీల పనులను పరిశీలిస్తారు. సాయంత్రం మంత్రి చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెం వెళతారు. జెర్రిపోతుల గూడెంలో రూ.8 కోట్ల నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కోదాడకు చేరుకుని కోదాడ పట్టణంలో రూ.26 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల హాస్పిటల్‌ పనులను పరిశీలిస్తారు. తదుపరి అనంతగిరి మండలం శాంతినగర్‌లో రూ.50 కోట్లతో నిర్మిస్తున్న రాజీవ్‌ శాంతినగర్‌ లిఫ్ట్‌ పనులను పరిశీలిస్తారు. అదేవిధంగా మునగాల మండలం, కృష్ణానగర్లో రూ.28.12 కోట్లతో నిర్మిస్తున్న లిఫ్ట్‌ పనులను పరిశీలిస్తారు. నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురంలో రూ.20 కోట్లతో బరాఖత్గూడెం నుంచి కాగిత రామచంద్రాపురం వరకు నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభిస్తారు.

డీఈఓపై చర్యలు తీసుకోవాలని వినతి

భానుపురి (సూర్యాపేట) : ప్రైవేట్‌ విద్యాసంస్థల దోపిడీకి సహకరిస్తున్న డీఈఓ అశోక్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌కు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో కార్పొరేట్‌ విద్యాసంస్థలు ప్రభుత్వ ఉత్తర్వులను, కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ లక్షల రూపాయల ఫీజులు దండుకుంటున్నాయని ఆరోపించారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌, బెల్టు, టై, షూ, బ్యాగ్‌లను పాఠశాలల్లోనే విక్రయిస్తూ వేలాది రూపాయలను విద్యార్థుల తల్లిదండ్రులకు నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నారని అన్నారు. ఏ ఒక్కరోజు కూడా పాఠశాలలను తనిఖీ చేయకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతున్న డీఈఓపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. వినతిపత్రం అందజేసినవారిలో పీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్‌ వర్మ, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి, జనసేవా సమితి అధ్యక్షుడు తగుళ్ల జనార్దన్‌, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి పిడమర్తి భరత్‌ ఉన్నారు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

సూర్యాపేటటౌన్‌ : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నిద్ర సంపత్‌నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ పిలుపు మేరకు సంపత్‌ నాయుడు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జూనియర్‌, డిగ్రీ కళాశాలల బంద్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్‌నాయుడు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల కాకపోవడంతో వేలాది మంది పేద, బీసీ విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ చదువులను కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు సురేష్‌ నాయక్‌, గుండ బాచి వర్మ, అనిల్‌, నరేష్‌, మౌనిక, సంధ్య, నవ్య, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement