సూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.107.30 కోట్ల అంచనా బడ్జెట్‌కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. సోమవారం జిల్లాకేంద్రంలోని రవి మహల్ ఫంక్షన్ హాల్‌లో సూర్యాపేట మున్సిపల్ 2025–26 ఆర్థిక సంవత్సరం సవరణ బడ్జెట్, 2026–27 ముసాయిదా బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది మాట్లాడుతూ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతోపాటు మున్సిపాలిటీ ఆదాయం పెంచడం ద్వారానే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అన్నిరకాల పన్నులు, అదనపు డిపాజిట్లు, ప్లాన్ గ్రాంట్, నాన్–ప్లాన్ గ్రాంట్, ఇతర అభివృద్ధి పనుల నిధులతో కలిపి మొత్తం రూ.107.30 కోట్లతో బడ్జెట్ రూపొందించామని వివరించారు. ఇందులోనే అన్ని రకాల ఖర్చులు (వేతనాలు), పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ చార్జీలు, రుణాల చెల్లింపులు, గ్రీన్ బడ్జెట్, ఇంజినీరింగ్ విభాగ నిర్వహణ, సాధారణ పరిపాలనకు కేటాయింపులు చేశామని ఆమె వివరించారు. అదనపు ఆదాయ వనరులను గుర్తించడం అత్యవసరమన్నారు. అక్రమ నిర్మాణాలను నియంత్రించడం, మున్సిపాలిటీ ఆస్తులను పరిరక్షించడం ద్వారా కూడా ఆదాయం పెంచుకోవచ్చని తెలిపారు. అనంతరం జరిగిన సాధారణ సమావేశంలో కౌన్సి లర్లు తమ వార్డుల సమస్యలను చైర్‌పర్సన్, కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫిఉల్లా, కమిషనర్ సీహెచ్. హన్మంతరెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రణాళికాబద్ధంగా సమస్యలు పరిష్కరించాలి
సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో నెలకొన్న సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరించడం మున్సిపల్ పాలక మండలి బాధ్యత అని అన్నారు. బడ్జెట్ లక్ష్యాలకు అనుగుణంగా మున్సిపాలిటీ ఆదాయ వనరులను పెంచుకోవాలన్నారు.
ఫ ఆమోదించిన మున్సిపల్ కౌన్సిల్
ఫ ఆదాయ వనరులు పెంచుకోవాలి :
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


