‘దండు మైసమ్మ’కు భద్రతేదీ?
విధుల పట్ల నిర్లక్ష్యం..
ఆత్మకూర్(ఎస్) : సూర్యాపేట జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న ఆత్మకూరు (ఎస్) మండలం నెమ్మికల్లు గ్రామంలోని శ్రీదండు మైసమ్మ తల్లి ఆలయానికి భద్రత లోపించింది. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తుండడం వల్ల ఇటీవల ఆలయ హుండీ చోరీకి గురైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఆలయాన్ని పునర్నిర్మించి అభివృద్ధి చేసింది. అయినప్పటికీ ఆలయ నిర్వహణ, భద్రతా విషయంలో నిర్లక్ష్యం అలుముకుంది. దాతలు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తుండడంతోపాటు భక్తులు హుండీలలో కానుకలతోపాటు వెండి, బంగారు వస్తువులను మొక్కుబడులుగా చెల్లించుకుంటున్నారు. ప్రతినెల హుండీ కానుకల ద్వారా సుమారు రూ.1.50 లక్షలకుపైగా ఆదాయం సమకూరుతుంది. దీంతో ఈ ఆలయం ఎండోమెంట్ విభాగం పరిధిలోకి వచ్చినప్పటి నుంచి 25 ఏళ్లుగా భక్తులు వెండి, బంగారం వస్తువులు సమర్పిస్తున్నప్పటికీ వాటి వివరాలకు సంబంధించిన రికార్డులు లేవని అధికారులే చెబుతుండడం గమనార్హం.
భద్రతా లోపంతోనే చోరీ..
దండు మైసమ్మ ఆలయ దర్శన ప్రారంభం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. సిబ్బంది ఎనిమిది గంటల పనిదినాల చొప్పున డ్యూటీ చేయాల్సి ఉండగా ఆలయ మేనేజర్ అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ఎవరు ఎప్పుడు వస్తున్నారు.. వెళ్తున్నారో అర్థంకాని పరిస్థితి. ఆలయానికి అవసరమైన సిబ్బంది, సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ సీసీ ఫుటేజీ స్టోరేజ్ రికార్డు లేకపోవడంపై సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తోంది. ఇదే అదునుగా భావించి ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి ప్రధాన గర్భగుడి వద్ద ఉన్న హుండీని ఎత్తుకెళ్లి చోరీ చేశారు. ఘటనలో దాదాపు రూ.20 వేల వరకు నగదు అపహరణకు గురైనట్టు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. అయితే చోరీ జరిగిన రోజు ఆలయంలో ఎవరూ విధుల్లో లేకపోవడంతో దుండగులు ఈ దశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. వాహన పూజలు మొక్కుబడుల వద్ద మాత్రం సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆలయ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వీడి సక్రమంగా విధులు నిర్వహిస్తూ ఆలయానికి భద్రతాలోపం లేకుండా చూడాలని స్థానికు ప్రజలు, భక్తులు కోరుతున్నారు.
ఫ ఆలయ నిర్వహణపై లోపించిన పర్యవేక్షణ
ఫ సరిపడా సిబ్బంది ఉన్నా విధుల్లో నిర్లక్ష్యం
ఫ నిఘా వైఫల్యంతో ఇటీవల హుండీ చోరీ
ఫ భద్రత పెంచాలంటున్న స్థానికులు
సూర్యాపేట–దంతాలపల్లి ప్రధాన రహదారిపై నెమ్మికల్లు వద్ద గల దండు మైసమ్మ ఆలయం సుమారు ఐదు దశాబ్దాలుగా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. 2001లో భక్తుల రద్దీ పెరగడంతో ఈ ఆలయాన్ని ప్రభుత్వం ఎండోమెంట్ పరిధిలోనికి తీసుకుంది. అప్పటినుంచి ఆలయ అభివృద్ధితోపాటు సిబ్బంది నియామకాలు చేపడుతున్నారు. ఈ ఆలయాన్ని ఆది, గురువారాల్లో సూర్యాపేట జిల్లాతోపాటు ఖమ్మం, వరంగల్, మహబూబబాద్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు.
‘దండు మైసమ్మ’కు భద్రతేదీ?


