కాంగ్రెస్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా మొరిశెట్టి నివేదితలక
స్థానిక రైతులకే యూరియా అందించాలి
మునగాల : జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో ఆయా సొసైటీల పరిధిలోని రైతులకే యూరియా అందించాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి శ్రీరాములు డిమాండ్ చేశారు. శుక్రవారం మునగాల మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. సొసైటీ పరిధిలో రైతులకు కాకుండా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న ఇతర గ్రామాల రైతులకు యూరియా ఇస్తుండడంతో స్థానిక రైతులకు దొరక్క ఇబ్బందులు పడుతున్నారన్నారు. యూరియా యాప్‌పై అవగాహన లేక రైతులకు యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. చందా చంద్రయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బచ్చలకూర స్వరాజ్యం, రైతు సంఘం మండల అధ్యక్షుడు చంద్రయ్య, మండల కమిటీ సభ్యులు దేశిరెడ్డి స్టాలిన్‌రెడ్డి, బోళ్ల కృష్ణారెడ్డి, మండవ వెంకటాద్రి, మల్లారెడ్డి పాల్గొన్నారు.
మోతాదుకు మించి యూరియా వాడొద్దు
పాలకవీడు : పంట పొలాల్లో యూరియాను మోతాదుకు మించి వాడొద్దని, అలా వాడితే పంటలకు అధికంగా చీడపీడలు ఆశించే ప్రమాదం ఉందని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) శ్రీధర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పాలకవీడు మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, విక్రయాల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ యూరియా విక్రయాలు పారదర్శకంగా ఉండాలని, ఫర్టిలైజర్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే ఎరువులు అందించాలని డీలర్లను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్‌కు నిరంతరం యూరియా సరఫరా కొనసాగుతందన్నారు. ప్రస్తుతం ఇక్కడ 400 యూరియా బస్తాల యూరియా అందుబాటులో ఉందన్నారు. అవసరమైన రైతులు యాప్‌లో బుక్ చేసుకోవాలన్నారు. డీలర్లు ఎవరైనా అధిక ధరలకు యూరియా అమ్మినా, రికార్డుల్లో తేడాలు ఉన్నా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఏఈఓలు, ఫర్టిలైజర్ డీలర్లు, రైతులు ఉన్నారు.
వైభవంగా నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం రాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు నిర్వహించి కల్యాణం చేపట్టారు. ఆ తర్వాత శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణా చార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా మొరిశెట్టి నివేదితలక


