దావత్‌లకు టైమైంది!
తాయిలాల పంపిణీకి ఏర్పాట్లు
సూర్యాపేట : మున్సిపల్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా పార్టీలు, బరిలో నిలిచిన అభ్యర్థులు వ్యూహాలు పన్నుతున్నాయి. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా మందు, విందులతో రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఉదయం నుంచే ఓటర్ల వేట ప్రారంభిస్తున్నారు. అన్నా.. కలుస్తాం.. సమయం ఇస్తారా.. ? అని చెప్పి సమయం, ప్రాంతాన్ని నిర్దేశించి రాత్రివేళ సిట్టింగ్‌లతో ఓటర్లను ప్రసన్నం చేసుకొని తమవైపు తిప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మందు పార్టీలకు ఖరీదైన బ్రాండ్‌లను ఎంపిక చేస్తున్నారు. ఇవే కాకుండా ఇతర తాయిలాల పంపిణీకి సైతం ఏర్పాట్లు చేసుకుంటున్నా.. పోలింగ్‌కు ఒకరోజు ముందు అందించే ఏర్పాట్లలో ఉన్నట్లు సమాచారం. మున్సిపాలిటీల్లో ఉదయం ప్రచారం.. రాత్రి మందు విందులు అన్నట్లుగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.
టౌన్‌షిప్‌ల వారీగా..
సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్ మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా ఆధారంగా అభ్యర్థులు ఉదయం నుంచే ఓటర్ల సమయాన్ని కోరుతున్నారు. తమకు పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా వార్డుల్లో ఉన్న ఉద్యోగులను రహస్య ప్రాంతాలకు తరలించి మందు, విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్లు, టౌన్‌షిప్‌ల వారీగా అక్కడ ఉన్న పార్టీ వ్యక్తులు, ముఖ్యులను కలుపుకుని ముందుకు పోతున్నారు. కొందరు అభ్యర్థులు సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఒకచోటకు చేర్చి దావత్‌లు ఇస్తున్నారు. ఇక రాత్రివేళ బయటకు రాలేని ఉద్యోగులు, ఇతరుల కోసం నేరుగా బాటిళ్లను తీసుకెళ్లి ఇస్తున్నట్లు సమాచారం.
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 141 వార్డులకు గాను 612 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు 2,26,646 మంది ఓటర్లు ఉన్నారు. ప్రాంతాల వారీగా ఓటర్లను గుర్తించి ఏ వర్గానికి ఏం తాయిలాలు ఇవ్వాలని అభ్యర్థులు ఇప్పటికే గుర్తించారు. ప్రధానంగా మాస్ వార్డుల్లో మహిళా ఓటర్లకు చీరలు పంపిణీ చేసేందుకు వివరాలు సేకరించుకుంటున్నారు. ప్రచారానికి సైతం ఉదయం, సాయంత్రం వేళల్లో అన్ని మున్సిపాలిటీల్లోనూ ప్రజలను పెద్ద ఎత్తున సమీకరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఆయా వార్డుల క్యాంపుల్లో కల్పిస్తున్నారు. టిఫిన్ నుంచి భోజనం వసతి ఇక్కడే చూసుకుంటున్నారు.
ఫ మున్సిపాలిటీల్లో విందులు షురూ
ఫ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థుల ప్రయత్నాలు
ఫ కమ్యూనిటీలు, టౌన్‌షిప్‌ల వారీగా సమావేశాలు
ఫ తాయిలాలు పంపిణీకి సిద్ధం
ఫ జోరందుకున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం


