ఏఐలో నార్కట్‌పల్లి వాసికి అంతర్జాతీయ గుర్తింపు
నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి మండలం మాధవ యడవెల్లి గ్రామానికి చెందిన కందగట్ల యాదవరెడ్డి, రజిత దంపతుల కుమారుడు జయచందర్‌రెడ్డి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. జయచందర్‌రెడ్డి ప్రస్తుతం అమెరికాలోని ఓ ప్రముఖ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఏఐ రంగలో చేస్తున్న కృషికి గాను 4 ప్రతిష్టాత్మక మార్కమ్ గోల్డ్ అవార్డులు, డావీ సిల్వర్ అవార్డులు పొందారు. గ్రామీణ ప్రజలు ఇంగ్లిష్ వైద్య నివేదికలు అర్థం చేసుకోవడంలో పడుతున్న ఇబ్బందులను గమనించిన ఆయన హెల్త్ నీమ్ అనే ఏఐ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు. ఈ ప్లాట్‌ఫామ్ సంక్షిప్త వైద్య సమాచారాన్ని తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లోకి అనువదించి సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుంది. అంతేకాకుండా గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్, నాసా వ్యోమగాములు సభ్యులుగా ఉన్న ప్రతిష్టాత్మకమైన ఐఈఈఈహెచ్‌కెఎన్ హారన్ సొసైటీలో జయచందర్‌రెడ్డికి సభ్యత్వం లభించడం విశేషం. తనకు వచ్చిన అవార్డులు, గుర్తింపును తన తల్లిదండ్రులు, సొంతూరికి అంకితమిస్తున్నట్లు జయచందర్‌రెడ్డి తెలిపారు.


