ప్రొటోకాల్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రొటోకాల్ దర్శనాలలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఈఓ వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రొటోకాల్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. దాతలకు, ఆర్మీ అధికారులకు కల్పిస్తున్న ప్రొటోకాల్ దర్శన సదుపాయాలు, దర్శనం సమయంలో అనుసరిస్తున్న మార్గదర్శకాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దర్శనాల్లో సాధారణ భక్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి అసౌకర్యం కలగకూడదని ఆదేశించారు. ప్రొటోకాల్ విభాగం సిబ్బంది పూర్తిస్థాయి బాధ్యతతో, పారదర్శకంగా విధులు నిర్వహించాలని, అన్ని దర్శనాలు నిబంధనల ప్రకారం ఉండాలని, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా క్రమశిక్షణతో పని చేయాలన్నారు. అనంతరం వైదిక కమిటీ, వివిధ విభాగాల అధికారుల సమీక్షలో మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని గిరి ప్రదక్షిణ ప్రారంభమయ్యే వైకుంఠద్వారం స్థలం వద్ద నృసింహస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దేవస్థానానికి సంబంధించిన అద్దెలు, లీజులు తదితర ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. దేవస్థానం ప్రాంగణంలో ఎలక్ట్రికల్ వాహన చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ ఈఓ దోర్బాల భాస్కర్‌శర్మ, ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు, సురేంద్రచార్యులు, అధికారులు దయాకర్‌రెడ్డి, జి. రఘు, రాజన్‌బాబు, ఆర్‌ఐ శేషగిరిరావు తదితరులున్నారు.
యాదగిరిగుట్ట ఆలయ
ఈఓ వెంకట్రావ్


