సరికొత్తగా సాగు.. దిగుబడులు బాగు
నడిగూడెం : గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో సాగు నీటి లభ్యత ఎక్కువగా పెరగడంతో ఎక్కువ శాతం రైతులు వరి సాగుపై దృష్టి సారించారు. అయితే కూలీల కొరత రైతులను వేధిస్తోంది. దీంతో నారుమడి అవసరం లేకుండా పంట కాలాన్ని తగ్గించడానికి వెదజల్లే పద్ధతిలో, డ్రమ్‌సీడర్ పద్ధతిలో వరి సాగుపై రైతులు దృష్టి సారిస్తున్నారు. నారు పోయడం, నీరు పెట్టడం, నాట్లు వేయించడం.. ఇవన్నీ పాత తరం వరి సాగు పద్ధతులు. రైతులు ఆధునిక వ్యవసాయం వైపు ఆసక్తి చూపుతున్నారు. రోజురోజుకు సాగుపై చేసే ఖర్చు పెరగడం, మరో వైపు కూలీల కొరతను అధిగమించేందుకు రైతులు డ్రమ్‌సీడర్ పద్ధతిని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పద్ధతి ద్వారా రైతులకు తక్కువ ఖర్చు అవుతుంది. ప్రస్తుత యాసంగి సీజన్‌లో నడిగూడెం మండల వ్యాప్తంగా దాదాపు 18,500 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇందులో దాదాపు 20 శాతం డ్రమ్‌సీడర్, 70 శాతం వెదజల్లే పద్ధతిలోనే పంట సాగు చేపట్టారు. డ్రమ్‌సీడర్‌ను రూ.4వేల నుంచి రూ.5వేల వరకు వెచ్చించి రైతులు కొనుగోలు చేస్తున్నారు. డ్రమ్‌సీడర్‌తో విత్తనాలు వెదజల్లడంతో నిర్ధిష్టమైన అంతరంలో సాళ్లు వస్తాయి. డ్రమ్‌సీడర్ విధానంతో 20 రోజుల ముందే పంట చేతికి వస్తుంది. 3 నుంచి 4 బస్తాల దిగుబడి అదనంగా వస్తుంది.
డ్రమ్ సీడర్, వెదజల్లే పద్ధతులపై
రైతుల్లో పెరుగుతున్న అవగాహన


