పెన్షనర్లపై నిర్లక్ష్య వైఖరి సరికాదు
మిర్యాలగూడ అర్బన్: పెన్షనర్లపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోషియేషన్ నల్లగొండ జిల్లా తృతీయ మహాసభలో వారు పాల్గొని మాట్లాడారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. రాజ్యాగం ప్రకారం పాలకులు నడుచుకోవడం లేదని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ నైతిక విలువలు పాటించడం లేదని, దీంతో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. విద్యారంగాన్ని సంస్కరించి ప్రభుత్వ విద్యారంగాన్ని, ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలని కోరారు. ఉచిత పథకాల వలన ప్రయోజనం లేదని వాటి స్థానంలో ఉత్పాదక శక్తిని పెంచే పథకాలను ప్రవేశపెట్టి నిరుద్యోగ సమస్యను తీర్చాలని కోరారు. పెన్షనర్లకు 5 డీఏలు పెండింగ్‌లో పెట్టి ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుందని, రెండో పీఆర్సీని ప్రకటించడంలో నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. ప్రతిఒక్కరు సామాజిక బాధ్యతగా ప్రభుత్వాలపై పోరాడి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పోతుల నారాయణరెడ్డి, పాలకుర్తి కృష్ణమూర్తి, సీనియర్ నాయకులు పాదూరి విద్యాసాగర్‌రెడ్డి, వి. బంగారయ్య, నూకల జగదీష్‌చంద్ర, అనుముల మధుసూదన్‌రెడ్డి, ఎం. జనార్దన్‌రెడ్డి, కడారి ప్రేమ్‌చంద్, వెంకటేశం, రాఫెల్, శ్యాంసుందర్, వాడపల్లి రమేష్, కృష్ణారెడ్డి, సత్తిరెడ్డి, ప్రకాశరావు, రామావతారం, శంకర్‌రెడ్డి, శ్రీనిసరెడ్డి, అంజిరెడ్డి, పులి కృష్ణమూర్తి, రమణారెడ్డి, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.


