ద్వేషపూరిత నేరాలకు వ్యతిరేకంగా చట్టం తేవాలి
● జమియత్ ఉలేమాయే హింద్ రాష్ట్ర అధ్యక్షుడు
మౌలానా సయ్యద్ ఎహసానుద్దీన్ ఖాస్మీ
రామగిరి(నల్లగొండ) : కర్ణాటక తరహాలో తెలంగాణలో కూడా ద్వేషపూరిత నేరాలకు వ్యతిరేకంగా చట్టం చేయాలని జమియత్ ఉలేమాయే హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఎహసానుద్దీన్ ఖాస్మీ డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జమియత్ ఉలేమాయే హింద్ కోరిన విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన హామీని నెరవేర్చాలన్నారు. భారతదేశంలో ముస్లింలపై వివక్ష, మైనారిటీలను ప్రజల నుంచి వేరుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశంలో ఈ బిల్లును వెంటనే ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు. ఈ సమావేశంలో జమియత్ ఉలేమాయే హింద్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఏ. హఫీజ్‌ఖాన్, జనరల్ సెక్రటరీ మౌలానా అక్బర్ ఖాన్, మౌలానా యాసిర్, అబ్దుల్ రెహమాన్, జియాఉద్దీన్, హఫీజ్ ఫుర్‌ఖాన్, సమీ, హఫీజ్ శంషుద్దీన్, హఫీజ్ అయూబ్ పాల్గొన్నారు.


