యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండాలి
చివ్వెంల(సూర్యాపేట) : యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూర్యాపేట జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి ఎస్. రాధాకృష్ణ చౌహాన్ సూచించారు. శనివారం సూర్యాపేట పట్టణంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ, హోలి క్రాస్ ఫౌండేషన్–జనబంధు పౌండేషన్ ఆధ్వర్యంలో డ్రగ్ డీ– అడిక్షన్‌పై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. పిల్లలు చెడుఅలవాట్లతో తల్లి దండ్రుల కష్టాన్ని వృథా చేయవద్దని హితవుపలికారు. మంచి స్నేహితులను, మంచి అలవాట్లను అలవర్చుకోవడం వల్ల జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవచ్చన్నారు. డ్రగ్స్, మద్యపానంతో యువత జీవితాలు చెడిపోవద్దన్నారు. సోషల్ మీడియా, సినిమాలు వంటి వాటితో యువత ఆకర్షితులు కావడం బాధాకరమన్నారు. మాదక ద్రవ్యాల జోలికి పోమంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి పర్హీన్ కౌసర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, నామినేటెడ్ సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్‌రావు, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జి.సత్యనారాయణ పాల్గొన్నారు.
ఫ జిల్లా మొదటి అదనపు
న్యాయమూర్తి రాధాకృష్ణ చౌహాన్


