గోదారి.. నీరేది!
న్యూస్‌రీల్
ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటి విడుదలపై కొరవడిన స్పష్టత
శనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
భానుపురి (సూర్యాపేట), అర్వపల్లి : యాసంగి సీజన్ ప్రారంభమైనా ఎస్సారెస్పీ కాల్వలకు సాగునీటి విడుదలపై స్పష్టత రాలేదు. యాసంగి పంటల సాగుకు నీళ్లిస్తారా లేదా తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. జిల్లా ఇరిగేషన్ అధికారులు నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించకపోవడంతో నార్లు పోసుకోవాలా.. వద్దా అనే విషయాన్ని తేల్చుకోలేక పోతున్నారు.
యాసంగి సాగు షురూ
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్‌లో 5,19,220 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో వరి 4,96,100 ఎకరాల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఎస్సారెస్సీ ఆయకట్టు కిందే 2 లక్షల ఎకరాల వరకు వరి సాగు ఉండనుంది. ప్రస్తుతం బోరుబావుల కింద అక్కకక్కడ నాట్లు వేస్తున్నారు. చాలావరకు నార్లు పోయడంతో పాటు దుక్కులు కూడా సిద్ధం చేసే పనిలో రైతులు ఉన్నారు. జిల్లాలోని మూసీ ఆయకట్టుకు సైతం ఇటీవలే సాగు నీటిని విడుదల చేయడంతో అక్కడ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.
షెడ్యూల్ ఊసెత్తని అధికారులు
జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలతో పాటు కోదాడలోని మోతె, నడిగూడెం, మునగాల మండలాల వరకు ఎస్సారెస్పీ ఆయకట్టు వ్యాపించి ఉంది. ప్రస్తుతం యాసంగి సీజన్ ప్రారంభమైనా ఎస్సారెస్పీ ఆయకట్టు కింద పంటల సాగుకు నీటిని విడుదల చేస్తారా లేదా అన్న విషయాన్ని అధికారులు స్పష్టం చేయడం లేదు. తరి పంటలకు నీటిని విడుదల చేస్తే ఇప్పటికే రైతులు నార్లు పోసుకోవాల్సి ఉంటుంది. అధికారులు నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించక పోవడంతో రైతులు అయోమయంలో ఉన్నారు. కొందరు రైతులు ధైర్యం చేసి బోర్ల కింద నారు పోసుకున్నారు. మరికొందరు నీటి విడుదల తేలకుండా నార్లు పోస్తే ఆగం అవుతామనే భావనలో ఉన్నారు. ఇరిగేషన్ అధికారులు ఎస్సారెస్పీ నీటి విడుదలపై స్పష్టత ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫ గోదావరి జలాల కోసం రైతుల
ఎదురుచూపు
ఫ సీజన్ ప్రారంభమైనా షెడ్యూల్
ప్రకటించని అధికారులు
ఫ జిల్లాలో 2.20 లక్షల ఎకరాల్లో ఎస్సారెస్పీ ఆయకట్టు
గోదారి.. నీరేది!


