ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర
సూర్యాపేట అర్బన్ : ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని, అందులో భాగంగానే కొత్త బిల్లు తీసుకొచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని ఎంవీఎన్ భవన్‌లో జరిగిన పార్టీ జిల్లా, మండల కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలకు చెందిన 30 కోట్లమందికి పైగా పేదలకు ఉపాధిని కల్పిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తుందని ఆరోపించారు. ఇప్పుడున్న చట్టంలో 90 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండగా, దానిని 60 శాతానికి తగ్గించి 40 శాతం నిధులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని బిల్లులో పేర్కొన్నారని అన్నారు. దాంతో నిధుల కొరత ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని ఎత్తివేసే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, ములకలపల్లి రాములు, నాగారపు పాండు, శేఖర్‌రావు, మట్టిపెల్లి సైదులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి


