లెక్కలు చెప్పాల్సిందే
నాగారం : గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు తాము చేసిన ఖర్చులను అధికారులకు సమర్పించాల్సి ఉంది. అందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు బుక్‌లెట్‌లో పొందిపర్చిన ఎంపీడీఓలకు సమర్పించిన వివరాలను, అధికారులు టీఈ–పోల్ వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. ఈ నివేదికలను 2026 ఫిబ్రవరి 15లోగా పంపాలని స్టేట్ ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఆదేశాలు జారీ చేసింది. దీని వల్ల పారదర్శకత పెరుగుతుందని పేర్కొంది.
గెలిచినా.. ఓడినా లెక్కలు ఇవ్వాలి
ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమకు గుర్తులు కేటాయించిన నాటి నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అయిన ఖర్చుల వివరాలు ఎంపీడీఓలకు సమర్పించాలి. గెలిచినా, ఓడినా ఖచ్చితంగా లెక్కలు చెప్పాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఆమేరకు ఎంపీఓలు ఇప్పటికే అభ్యర్థులకు సూచనలు చేస్తున్నారు.
జనాభా ఆధారంగా ఖర్చులు
2011 జనాభా లెక్కల ప్రకారం 5వేలు, అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థికి రూ.2.50 లక్షలు, వార్డు సభ్యుడికి రూ.50 వేలు ఖర్చు చేయాలి. 5వేల కన్నా తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థికి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ.30 వేల వరకు ఖర్చు చేయవచ్చు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన నాటి నుంచి 45 రోజుల లోపు సర్పంచ్, వార్డు మెంబర్‌కు పోటీ చేసిన అభ్యర్థులు ఎంపీడీఓకు లెక్కలు చెప్పాలి. ఆలా చెప్పని వారికి మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంటుంది. గెలిచిన వారు పదవి కోల్పోయే అవకాశం ఉంటుంది.
బాధ్యతలు గుర్తెరగాలి
సర్పంచ్‌లు తమ బాధ్యతలను గుర్తెరిగి ఆ ప్రకారం పని చేయాల్సి ఉంటుంది. నెలకోసారి పంచాయతీ పాలకవర్గ సమావేశం, రెండు నెలల కోసారి గ్రామసభ నిర్వహించాలి. పంచాయతీ వార్షిక ఆడిట్లు, లెక్కలు పూర్తి చేయకపోయినా, అవినీతికి పాల్పడినా పదవి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ మేరకు కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లకు అవగాహన కల్పించేందుకు అధికారులు సమాయత్త మవుతున్నారు. మొదట వారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం సర్పంచులు, వార్డు సభ్యులకు అవగాహన కల్పించనున్నారు.
ఫ అభ్యర్థుల ఎన్నికల వ్యయం
నమోదుకు ‘టీఈ–పోల్’
ఫ నూతన విధానం
తెచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం
ఫ గడువులోపు పంపాలని
అభ్యర్థులకు ఆదేశాలు


