నేడు హుజూర్‌నగర్‌కు మంత్రి ఉత్తమ్ రాక
హుజూర్‌నగర్ : రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి శనివారం హుజూర్‌నగర్‌కు రానున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో ఎన్నికై న నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సర్పంచ్‌లు, వార్డు సభ్యలను పట్టణంలోని కౌండిన్య ఫంక్షన్‌హాల్లో మంత్రి ఉత్తమ్ పఆర్‌ఓ వెంకటరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్య క్రమానికి
కాంగ్రెస్ బ్లాక్, మండల, గ్రామ శాఖల అధ్యక్షులు పాల్గొనాలని ఆయన కోరారు.
జిల్లా మొదటి అదనపు న్యామూర్తి బదిలీ
చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి ఎం.రాధాకృష్ణ చౌహన్ సికింద్రాబాద్ జ్యూడీషియల్ అకాడమీకి బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల క్రితం ఆయన పదోన్నతిపై హుజూర్‌నగర్ కోర్టు నుంచి సూర్యాపేట జిల్లా కోర్టుకు వచ్చారు. సాధారణ బదిలీల్లో భాగంగా అకాడమీకి వెళ్లారు. అక్కడ సీనియర్ ఫ్యాకల్టీగా విధులు నిర్వహించనున్నారు.
సీఐ సస్పెన్షన్
కోదాడ రూరల్ : కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ రిమాండ్ ఖైదీగా ఉంటూ మృతిచెందిన కేసులో పోలీసులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగంను సస్పెండ్ చేయగా.. చిలుకూరు ఎస్సై సురేష్‌రెడ్డిని ఎస్పీ కార్యాలయనికి అటాచ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేసినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజేష్ కేసులో పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చినందున అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజేష్ మృతికి కారకులైన పోలీసుల పై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మరికొంత మంది పోలీసులపై కూడా వేటు పడే అవకాశం ఉంది.
ఉద్యోగుల డీఏ బకాయిలు విడుదల చేయాలి
మోతె : ఉద్యోగులకు రావాల్సిన ఐదు డీఏల బకాయిలను, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి డి.లాలు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మోతె మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో సంఘం సమావేశానికి సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ నెల 21న తుంగతుర్తిలో జరిగే టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశాల్లో రాష్ట్రంలో విద్యారంగా సమస్యలతో పాటు పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సంఘం మండలాధ్యక్షుడు డి.నరేందర్, ఉపాధ్యక్షులు యాదయ్య, సాయిశ్యాం, ఉషారాణి, గురులక్ష్మి, పాఠశాల ప్రధానో పాధ్యాయుడు శోభాబాయి పాల్గొన్నారు.
సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తులు
భానుపురి (సూర్యాపేట) : అల్ప సంఖ్యాక వర్గాల (ముస్లిములు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, పార్శీలు) వారు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం అందిస్తున్న ‘సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం’ కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎల్.శ్రీనివాస్‌నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్, సింగపూర్ దేశాల్లో చదువుకునేందుకు ఈ స్కాలర్‌షిప్ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఒకటి జూలై 2025 నుంచి 31 డిసెంబర్ 2025 మధ్య కాలంలో (ఫాల్ సీజన్ 2025) అడ్మిషన్ తీసుకున్న అర్హత కలిగిన అభ్యర్ధులు www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయములో అందించాలన్నారు. విద్యార్థుల తల్లితండ్రుల వార్షిక ఆదాయం రూ.5లక్షల లోపు ఉండేవారు అర్హులని తెలిపారు. ఈ పథకం కింద ఎంపిక చేయబడిన విద్యార్థికి స్కాలర్ షిప్ కింద రూ.20 లక్షలు రెండు విడతల్లో ప్రభుత్వం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. విమాన చార్జీలు రూ. 60వేలకు మించకుండా చెల్లిస్తుందని తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 20 నుంచి వచ్చేనెల 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.


