కళలకు పుట్టినిల్లు పేట
సూర్యాపేట టౌన్ : సూర్యాపేట కళలకు పుట్టినిల్లు అని, జిల్లాకు చెందిన ఎందరో కళాకారులు ఉన్నత స్థాయికి ఎదిగి వారి ప్రతిభతో పేటకు వన్నె తెచ్చారని డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్ అన్నారు. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ జయంతి సందర్భంగా జ్ఞాన సరస్వతి కళావేదిక ఆధ్వర్యంలో జిల్లా బాలభవన్ ఆవరణలో శుక్రవారం రాష్ట్ర స్థాయి పాటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటసాల చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ రామ్మూర్తి యాదవ్ మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను పాటలు వినడం వల్ల కొంత వరకు తగ్గించుకోవచ్చన్నారు. సంగీతంతో కొన్ని రకాల మానసిక రోగాలు నయమవుతాయనే మాటలో వాస్తవం ఉందన్నారు. కార్యక్రమంలో సుమారు 50 మంది కళాకారులు పాల్గొని పాటలు పాడారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. బూర వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భూపతి రాములు, జైలర్ సుధాకర్‌రెడ్డి, చిన్న శ్రీరాములు, డాక్టర్ రంగారెడ్డి, హమీద్‌ఖాన్, నన్నెపంగు సైదులు, బాల భవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ పాల్గొన్నారు.


