ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
నేరేడుచర్ల : సూర్యాపేట జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 86.25 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. అదేవిధంగా పెంచికల్‌దిన్న గ్రామ పంచాయతీ పరిధిలోని తెలగరామయ్యగూడెంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ అనూష పరిశీలించారు. వారి వెంట తహసీల్దార్ సురగి సైదులు, ఎంపీడీఓ సోమ సుందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
పెన్షనర్ల వ్యతిరేక
జీఓను రద్దుచేయాలి
భానుపురి (సూర్యాపేట) : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షనర్ల వ్యతిరేక జీఓను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.సీతారామయ్య డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ఏఓ సుదర్శన్‌రెడ్డికి ఈ మేరకు సంఘం సూర్యాపేట జిల్లా శాఖ తరఫున వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల రిటైర్డ్ ఉద్యోగులకు వ్యతిరేకంగా జీఓను తీసుకొచ్చిందన్నారు. ఈ జీఓ ప్రకారం 2026 జనవరికి ముందు రిటైర్డ్ అయ్యే వారికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఉండకుండా చేసిందన్నారు. పెన్షనర్ల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తెచ్చిన ఈ జీఓను వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ రద్దు చేయాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిటైర్డ్ ఉద్యోగులకు కావాల్సిన ఏరకమైన బెనిఫిట్స్ రాకుండా అడ్డుకుంటున్నాయని, మెడికల్ బిల్లులు రావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు, ప్రధాన కార్యదర్శి దండా శ్యాంసుందర్ రెడ్డి, కోశాధికారి ఎస్.ఏ. హమీద్ ఖాన్, మండల అధ్యక్షుడు ఎస్.యాదగిరి, కోదాడ యూనిట్ అధ్యక్షుడు వి.శ్రీనివాసరావు, సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) కార్యదర్శులు సుదగాని నాగేశ్వర్ రావు, ఎస్‌ఏ అబ్దుల్లా పాల్గొన్నారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని బుధవారం అర్చకులు వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు,అభిషేకాలు చేశారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం రక్తి గట్టించారు. అవిష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు.


