చివరి సంగ్రామం
మూడో విడతలో ఇలా..
హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 124 పంచాయతీలు, 1,061 వార్డులకు నేడు ఎన్నికలు
ఫ ఉదయం 7గంటల నుంచి
మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్
ఫ సాయంత్రానికి తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
ఫ ఓటు హక్కు వినియోగించుకోనున్న 1,92,617 మంది ఓటర్లు
ఫ ఇప్పటికే 22 జీపీలు,
257 వార్డులు ఏకగ్రీవం
సూర్యాపేట / హుజూర్‌నగర్ : పంచాయతీ పోరు చివరి అంకానికి చేరింది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడో విడతలో హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఏకగ్రీవమైనవి పోగా మిగిలిన 124 గ్రామపంచాయతీలు, 1,061 వార్డులకు బుధవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. 2గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలు వెల్లడిస్తారు. చివరి విడతలో 1,92,617 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మంగళవారం మధ్యాహ్నం నుంచే సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి తీసుకొని వెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు.
ఏడు మండలాల్లో..
మూడో విడతకు సంబంధించి హుజూర్‌నగర్, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకవీడు మండలాల పరిధిలోని 146 గ్రామపంచాయతీలు, 1,318 వార్డులకు ఈనెల 2వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించగా 9వ తేదీన విత్‌డ్రాకు అవకాశమిచ్చి అదేరోజున అభ్యర్థుల తుది జాబితాను ప్రదర్శించారు. ఇందులో 22 పంచాయతీలు, 257 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 124 సర్పంచ్ స్థానాలకు 371 మంది అభ్యర్థులు, 1,061 వార్డులకు 2,452 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఎన్నికల విధుల్లో సిబ్బంది..
మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిబ్బంది నియామకం నుంచి బ్యాలెట్ పత్రాల వరకు అన్నింటినీ సమకూర్చుకున్నారు. ఏడు మండలాల్లో ఏర్పాటు చేసిన 7 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి 45 రూట్ల ద్వారా మంగళవారం మధ్యాహ్నం నుంచే ఎన్నికల సిబ్బందితో పాటు పోలింగ్ సామగ్రిని 116 పెద్దవాహనాలు, మరో 64 చిన్న వాహనాల్లో గ్రామాలకు తరలించారు. 259 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 1,176 పోలింగ్ కేంద్రాల్లో బుధవారం 1,92,617 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1,538 మంది పీఓ (ప్రిసైడింగ్ అధికారి), 2026 మంది ఓపీఓలు, 183 మంది స్టేజ్ –2 అధికారులు, 50 మంది రూట్ ఆఫీసర్లు, 57 మంది మైక్రో అబ్జర్వర్లు తమకు కేటాయించిన విధుల్లో చేరారు. మరో ఏడుగురు వ్యయ పరిశీలకులు ఉన్నారు. వీరే కాకుండా జోనల్ ఆఫీసర్లు 26 మంది, 14 ఎఫ్‌ఎస్‌టీ, మరో ఎస్‌ఎస్‌టీ బృందం విధుల్లో చేరారు. ఇప్పటికే తమకు కేటాయించిన పంచాయతీలకు చేరుకున్న వీరంతా తెల్లవారుజాము నుంచే పోలింగ్‌కు అనుగుణంగా 1,294 బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేసుకున్నారు. ఉదయం 7గంటల నుంచే పోలింగ్ జరగనుంది.
సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టంగా..
ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ఇదేవిధంగా చివరి దశను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పనిచేస్తోంది. ప్రధానంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. ఇక్కడ అదనపు బలగాలు, సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ నడుమ పోలింగ్ జరగనుంది. మూడో విడతలోఉన్న 7 మండలాల్లో 234 సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు గుర్తించారు. వెబ్ కాస్టింగ్ కోసం 105 గ్రామపంచాయతీలు, 220 ప్రాంతాలను గుర్తించి ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు.
అత్యధికంగా గరిడేపల్లి మండలంలో41,985 మంది ఓటర్లు
హుజూర్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో ఉన్న గ్రామపంచాయతీల్లో దాదాపు 1,92,617 మంది ఓటర్లు ఓటు వేసి అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇందులో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. ఓటర్లలో పురుషులు 93,658 మంది, మహిళలు 98,952 మంది, ఇతరులు ఏడుగురు నమోదై ఉన్నారు. అత్యధికంగా గరిడేపల్లి మండలంలో 41,985 మంది ఓటర్లు ఉన్నారు. చింతలపాలెంలో 26,056 మంది, హుజూర్‌నగర్‌లో 20,467 మంది, మఠంపల్లిలో 35,265 మంది, మేళ్లచెర్వులో 29,678 మంది, నేరేడుచర్లలో 20,550 మంది, పాలకవీడు మండలంలో 18,616 మంది చొప్పున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని సర్పంచ్, వార్డు సభ్యులను ఎన్నుకోనున్నారు.
మండలం ఏకగ్రీవం ఎన్నికలుజరిగే పోలింగ్ ఓటర్లు
గ్రామాలు స్టేషన్లు
చింతలపాలెం 01 15 140 26,056
గరిడేపల్లి 08 25 252 41,985
హుజూర్‌నగర్ 01 10 102 20467
మఠంపల్లి 03 26 230 35265
మేళ్లచెరువు 03 13 141 29678
నేరేడుచర్ల 03 16 151 20550
పాలకవీడు 03 19 160 18616
మొత్తం 22 124 1,176 1,92,617
చివరి సంగ్రామం
చివరి సంగ్రామం


