ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
హుజుర్‌నగర్(గరిడేపల్లి) : ఎన్నికల విధుల నిర్వహణలో పోలీస్‌సిబ్బంది నిర్లక్ష్యం వహించొద్దని జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. మూడో దశ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గరిడేపల్లి మండల పరిధిలో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న పోలీస్ సిబ్బందికి మంగళవారం గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ సిబ్బంది పాత్ర కీలకమన్నారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దన్నారు. విధులు పూర్తయ్యే వరకు కేటాయించిన ప్రాంతాలను విడిచిపెట్టవద్దని, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను క్రమపద్ధతిలో ఉంచాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు కఠినంగా అమలు చేయాలన్నారు. ఓటర్లు సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకువస్తున్నారా అనే అంశంపై నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల కోడ్ (ఎంసీసీ) నియమాలను కచ్చితంగా పాటిస్తూ, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. విధుల నిర్వహణలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఉన్నత అధికారులకు తెలియజేయాలని, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. గరిడేపల్లి మండలంలోని పొనుగోడు, వెలిదండ, గడ్డిపల్లి, కుతుబ్షాపురం, గానుగబండ, గారకుంట తండా, కల్మలచెరువు, శీత్ల తండా, సొమ్ల తండా, లుంబ తండా, రాయనిగూడెం, రంగాపురం, కీతవరిగూడెం గ్రామాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ బి. శ్రీనివాస్ రెడ్డి, హుజూర్‌నగర్ సీఐ జి. చరమంద రాజు, మునగాల సీఐ రామకృష్ణా రెడ్డి, గరిడేపల్లి ఎస్‌ఐ నరేష్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ
ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు


