ప్రణాళికా బద్ధంగా పంచాయతీ ఎన్నికలు
నేరేడుచర్ల: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రజాస్వామ్యయుతంగా, ప్రణాళికా బద్ధంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తేజస్ నంద్ లాల్‌పవార్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం నేరేడుచర్ల మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్‌ను పరిశీలించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అంతా సిద్ధం చేశామన్నారు. తక్కువ ఓటర్లు ఉన్న కేంద్రాల్లో పోలింగ్ పూర్తి అయినప్పటికీ కేంద్రాన్ని మూసివేయవద్దని కేటాయించిన సమయం వరకు తెరుచుకొని ఉండాలన్నారు. పోలింగ్ సమయం లోపు కేంద్రాల్లోని క్యూలైన్‌లో ఉన్న ఓటర్లుకు టోకెన్లు జారీ చేయాలన్నారు. కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రం, లెక్కింపు కేంద్రం వేరువేరుగా ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ పూర్తి కాగానే లెక్కింపు కేంద్రానికి బ్యాలెట్ పేపర్లు పోలీస్ భద్రత మధ్య తరలించాలన్నారు. మధ్యాహ్నం 2గంటలకు తప్పనిసరిగా వీడియో తీస్తూ బ్యాలెట్ పేపర్లు తెరిచి లెక్కింపు ప్రక్రియను ప్రారంభించాలన్నారు. అదే విధంగా కౌంటింగ్ టెబుల్‌కు రెండు, మూడు అడుగుల దూరంలో అభ్యర్థులు ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రాష్ట్ర ఎన్నికల క మిషన్ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తరువాత స్టేజ్–2 అధికారులు ముందుగా జిల్లా ఎన్నికల అధికారితో గానీ, జనరల్ అబ్జర్వర్‌తోగానీ అనుమతి తీసుకొని ఫలితాలు ప్రకటించాలన్నారు. ఫలితాల అనుమతి కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సిబ్బంది ఎన్నికల కేంద్రాల వద్ద పరిస్థితిని గమనించి జిల్లా టీమ్‌కు గానీ, మండల టీంకు గానీ సమాచారం అందిస్తే అవసరమైన అదనపు సిబ్బందిని పోలీస్ భద్రతను సకాలంలో పంపిస్తామన్నారు. లెక్కింపు పూర్తయి ఫలితాలు ప్రకటించిన తరువాత ఉప సర్పంచ్ ఎన్నిక కోసం నోటీసులు జారీ చేసి సంతకాలు తీసుకోవాలన్నారు. సాధ్య మైనందత వరకు అదే రోజు పూర్తి చేయాలని, అవసరమైతే రెండవ సారి నోటీసులు జారీ చేయాలన్నారు. సమావేశంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ అనూష, మండల ప్రత్యేక అధికారి మోహన్‌బాబు, తహసీల్దార్ సైదులు, ఎంపీడీఓ సోమ సుందర్‌రెడ్డి, ఎంపీఓ నాగరాజు, ఎస్‌ఐ రవీందర్‌నాయక్‌తో పాటు పోలింగ్ సిబ్బంది ఉన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


