మట్టపల్లిలో ధనుర్మాసోత్సవాలు ప్రారంభం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మంగళవారం ధనుర్మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారు జామునే శ్రీలక్ష్మీనరసింహస్వామి తో పాటు శ్రీగోదాదేవి రంగనాయకుల స్వామి వార్లకు ప్రత్యేక పూజలు, మహానివేదనతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. జనవరి 11న కూడారై ఉత్సవం,14న శ్రీగోదాదేవి రంగనాయకులస్వామి కల్యాణం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
నిత్యకల్యాణం
మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని మంగళవారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం చేపట్టారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. ఆలయ తిరుమాడ వీధుల్లో శ్రీస్వామి వారిని గరుడవాహనంపై ఊరేగించారు.


