మునగాలలో రీకౌంటింగ్ చేయాలి
కోదాడ: మునగాలలో రీకౌంటింగ్ చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం కోదాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. అక్రమ సంపాదనతో మునగాల మండలంలో మాఫియాడాన్‌గా మారిన వ్యక్తికి లబ్ధి చేకూర్చడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో గెలుపుకోసం పోరాడిన నిరుపేద మహిళకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిలు అన్యాయం చేశారని ఆరోపించారు. అధికారుల అండతో కౌంటింగ్‌ను హైజాక్ చేసి మాఫియాడాన్ ఐదు ఓట్లతో గెలిచినట్లు ప్రకటింప జేశారని పేర్కొన్నారు. కోదాడ నియోజకవర్గంలో తాను ఎంపిక చేసిన అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే ప్రాధేయపడినా అన్ని చోట్లా ఓడిపోయారని, కాంగ్రెస్ పని ఐపోయిందని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా గెలిచిన తమ పార్టీ మద్దతుదారులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ అద్యక్షుడు ఎస్‌కె. నయీం, తొగరు రమేష్, కందిబండ సత్యనారాయణ, శెట్టి సురేష్‌నాయుడు, మీసాల శోభారాణి, కర్ల సుందర్‌బాబు, మాదాల ఉపేంధర్ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్


