పెన్షనర్ల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
కోదాడ: పెన్షనర్లు పోరాడి సాధించుకున్న హక్కులను అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని విశ్రాంత ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి సుధాకర్ ఆరోపించారు. గురువారం కోదాడ పెన్షన్ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభత్వం చేసిన చట్టానికి వ్యతిరేకంగా త్వరలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వచ్చే మార్చిలో పెన్షనర్లతో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి పెన్షనర్లు పూర్తి మద్దతు ఇచ్చి అధికారంలోకి రావడానికి పూర్తిగా సహకరించామని, కాని కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్‌దారుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విశ్రాంత ఉద్యోగులందరికీ నగదు రహిత వైద్యసేవలు అందించాలన్నారు. 2024 తరువాత ఉద్యోగ విరమణ చేసిన వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య, జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు, కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి సీతరామయ్య, రాజేంద్రబాబు, లింగన్న, ప్రభాకర్, జానయ్య, రఘువరప్రసాద్, విద్యాసాగర్, భ్రమరాంబ, శోభ పాల్గొన్నారు.
కోడ్ ముగిసే వరకు
విజయోత్సవాలు నిషేధం
సూర్యాపేటటౌన్ : ఎన్నికల ఫలితాలు వచ్చినా ర్యాలీలు, విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ నరసింహ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. మూడు దశల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో కొనసాగుతుందని పేర్కొన్నారు. తొలి దశ ఫలితాలు వచ్చినా గెలిచిన అభ్యర్థులు లేదా వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, భారీ సభలు, బైక్ ర్యాలీలు, శోభాయాత్రలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. ఎన్నికల నియమాలను అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, శాంతియుత వాతావరణం కోసం ప్రజలు, నాయకులు, అభ్యర్థులు పూర్తి సహకారం అందించాలని కోరారు.
విశేషంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి గురువారం నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో విశేషంగా నిర్వహించారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరిపించారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ వైభవంగా నిర్వహించారు. ఆలయ తిరుమాడ వీధుల్లో శ్రీస్వామి వారిని గరుడవాహనంపై ఊరేగించారు. అనంతరం మహానివేదనతో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు భక్తులు పాల్గొన్నారు.
తైక్వాండో పోటీల కోచ్‌గా యూనుస్ కమాల్
నల్లగొండ టూటౌన్ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు రెఫరీగా నల్లగొండ పట్టణానికి చెందిన సీనియర్ కోచ్ ఎండీ.యూనుస్ కమాల్ ఎంపికయ్యారు. తన మీద నమ్మకంతో జాతీయ రెఫరీగా ఎంపిక చేసిన రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌కు యూనుస్ కమాల్ కృతజ్ఞతలు తెలిపారు.
పెన్షనర్ల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు


