రెండో విడత ప్రచారానికి నేటితో తెర
చివరి రోజు డబ్బు
పంపిణీకి ఏర్పాట్లు..
కోదాడ: జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలు జరిగే ఎనిమిది మండలాల పరిధిలోని 181 గ్రామపంచాయతీల్లో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారానికి తెరపడనుంది. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుండడంతో అభ్యర్థులకు శుక్ర, శనివారం ఈ రెండు కీలకం కానున్నాయి. శుక్రవారం గ్రామాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి బలప్రదర్శన చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. ర్యాలీలో ఎక్కువ మంది పాల్గొనేలా చేయడానికి ఒక్కొక్కరికి ముఖ్యంగా మహిళలకు రూ.400 నుంచి రూ.500వరకు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి ఓటర్లకు మద్యం, మాంసం పంపిణీ చేయడానికి ఆర్డర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. కోదాడలోని పలు చికెన్ సెంటర్ల నిర్వాహకులకు వందల కేజీల ఆర్డర్లు రావడంతో రోజువారీగా వచ్చేవారికి కేజీ, అరకేజీ ఇవ్వడం లేదు. ఇక మద్యం పంపిణీ కోసం క్వార్టర్ బాటిల్స్ ఎక్కువగా అభ్యర్థులు కొనుగోలు చేస్తుండడంతో మద్యం దుకాణాల్లో వీటి కొరత ఏర్పడింది.
ఎక్కడ ఉన్నా రప్పిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కావడంతో దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రప్పించడానికి అభ్యర్థులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు కార్లు ఏర్పాటు చేస్తున్నారు. కొందరు యువకులు బెంగళూరులో ఉండడంతో వారికి ఫ్లైట్, రైల్ టికెట్లను కూడా బుక్ చేసి పిలిపిస్తున్నారు. కోదాడ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 8 మంది యువకులు పూణేలో ఉండడంతో వారిని రప్పించడానికి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది.
అభ్యర్థులు శుక్రవారం ఓటర్లకు మద్యం పంపిణీ పూర్తిచేసి శనివారం డబ్బు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రత్యర్థి ఇచ్చేదాన్ని బట్టి తాము ఇస్తామని రెండు వర్గాలు వేచి చూస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో ఓటుకు రూ.1000 నుంచి రూ.2వేల వరకు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. కోదాడ నియోజకవర్గ పరిధిలో పోటాపోటీగా ఉన్న మునగాల, బేతవోలు, చిలుకూరు, గుడిబండ, గణపవరం, రెడ్లకుంట, వాయిల సింగారం గ్రామాల్లో రూ.3వేల వరకు పంచడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ అయిన గ్రామాల్లో కూడా ఓటుకు రూ.2వేల వరకు పంచడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
ఫ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు
ఫ డబ్బు, మాంసం,
మద్యం పంపిణీకి కసరత్తు
ఫ దూరప్రాంతాల్లోని ఓటర్లను
రప్పించేందుకు అభ్యర్థుల ప్రయత్నం


