వైభవంగా అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠ
మునగాల : మండలంలోని ఆకుపాముల గ్రామ శివారులో సుమారు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన హరిహరసుత అయ్యప్ప దేవాలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం కనులపండువగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 11.15 గంటలకు అయ్యప్ప స్వామి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్ఠతో పాటు శ్రీ విఘ్నేశ్వర, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర, శ్రీమాలికపు రత్తమ్మ, మంజుమాత ఉప ఆలయాలు, బొడ్రాయి పున: ప్రతిష్ఠ కార్యక్రమాలను వేదపండితుల సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిలకించేందుకు పరిసర గ్రామాలకు చెందిన వందలాది మంది అయ్యప్ప మాలధారులు, ప్రజలు తరలివచ్చారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సుమారు ఐదువేల మందికి మహా అన్నదానాన్ని నిర్వహించారు. ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా ఆకుపాముల శివారులో జాతీయ రహదారి భక్తులతో, వాహనాలతో కిక్కిరిసిపోవడంతో మునగాల పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. దేవాలయ కమిటీ అధ్యక్షుడు, గ్రామ మాజీ సర్పంచ్ కేసగాని వెంకటేశ్వర్లు గురుస్వామి ఆధ్వర్యంలో ఈ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీవిద్యా ఉపాసకులు పెద్దింటి వేణురామకృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠ


