సౌకర్యాలు ఘనం.. కోర్సులు పరిమితం
ప్రతిపాదనలు పంపించాం
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అవసరమైన కోర్సులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. 17 సంవత్సరాల క్రితం ఏ కోర్సులు ఉన్నాయో ఇప్పటికీ అవే కొనసాగుతున్నాయి. తిరుమలగిరిలో 2008లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయగా మొదటగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. 2013లో మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ స్థలంలో నూతన భవనాన్ని ప్రారంభించారు. కళాశాల ప్రారంభంలో మెకానికల్, సివిల్ కోర్సులు ఏర్పాటు చేశారు. సూర్యాపేట–జనగామ ప్రధాన రహదారితో పాటు తిరుమలగిరి క్రాస్ రోడ్డుకు దగ్గరగా ఉండటంతో చాలా మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌లో తిరుమలగిరిని ఎంపిక చేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యార్థులు సీఎస్‌ఈ, ఈఈఈ, ఎంసీహెచ్ కోర్సులు కావాలని కోరుతున్నా వాటిని మాత్రం ఇప్పటి వరకు ఏర్పాటు చేయడం లేదు.
ఐదెకరాల విస్తీర్ణంలో కళాశాల
తిరుమలగిరి పాలిటెక్నిక్ కళాశాల ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కళాశాలలో 360 సీట్లు ఉన్నాయి. బాలురకు ప్రత్యేక వసతి గృహం ఉంది. పక్కా భవనం, అత్యాధునిక వసతులతో ల్యాబ్ సౌకర్యం ఉంది. ప్రతిఏటా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. అయినా అవసరమైన కోర్సులు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.
పాలిటెక్నిక్ కళాశాలలో అదనపు కోర్సుల ఏర్పాటుకు గతంలోనే ప్రతిపాదనలు పంపాము. ఎమ్మెల్యే, ఎంపీకి వినతి పత్రాలు కూడ అందజేశాము. డిమాండ్ ఉన్న ముఖ్యమైన కోర్సులు వస్తే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది.
– సత్తయ్య, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్
ఫ తిరుమలగిరిలోని పాలిటెక్నిక్
కళాశాలలో ఏర్పాటు కాని సీఎస్‌ఈ, ఈఈఈ, ఎంసీహెచ్ కోర్సులు
ఫ నష్టపోతున్న విద్యార్థులు


