శ్రీలక్ష్మీనారసింహుడి నిత్యకల్యాణం
హుజూర్‌నగర్: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా కార్తీకమాస పూజల్లో భాగంగా క్షేత్రంలోని శివాలయంలో గల శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి ప్రత్యేక అర్చనలు ఏకాదశ రుద్రాభిషేకం జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా సౌరహోమం
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకుడు కాకులారపు రజితాజనార్దన్, గణపురం నరేశ్, ఇంద్రారెడ్డి, బెలిదె లక్ష్మయ్య, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే, శ్రీరాంపాండే పాల్గొన్నారు.
నేత్రపర్వంగా
తిరునక్షత్ర వేడుకలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీమణవాళ మహాముని తిరునక్షత్ర వేడుకలను ఆదివారం నేత్రపర్వంగా చేపట్టారు. ఉదయం స్నపన తిరుమంజన అభిషేకం, సేవా కాలాన్ని ఘనంగా నిర్వహించారు. రాత్రి పురఫ్ఫాట్ సేవ జరిపించి ఆలయ తిరు, మాడీ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో సేవాకాలం జరిపించి, ప్రబంధ పారాయణాలను పఠించారు.
స్తంభోద్భవుడి సన్నిధిలో కోలాహలం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కోలాహలం నెలకొంది. కార్తీకమాసం, ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు ఉదయం నుంచే స్వామివారి దర్శనం కోసం వేలాది తరలివచ్చారు. వేకుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. గుర్భాలయంలో కొలువుదీరిన స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి, కార్తీక దీపారాధనన చేశారు.
దైవభక్తితోనే
ప్రశాంత జీవనం
నల్లగొండ : ప్రతిఒక్కరూ దైవభక్తి కలిగి ఉంటేనే ప్రశాంత జీవనం సాగించచడం సాధ్యమని త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి అన్నారు. కార్తీక మాసం సందర్భంగా నల్లగొండ పట్టణంలోని బసవేశ్వర భవన్‌లో ఆదివారం సామూహిక విరాట్ విష్ణు సహస్రనామ పారాయణ యజ్ఞ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా భక్తులకు భగవత్ భగవతాచార్య ప్రవచనాలు వినిపించారు. అనంతరం భక్తులు భజనలతో అలరించారు. కార్యక్రమంలో బసవేశ్వర భవన్ నిర్వాహకులు పాల్గొన్నారు.
శ్రీలక్ష్మీనారసింహుడి నిత్యకల్యాణం
శ్రీలక్ష్మీనారసింహుడి నిత్యకల్యాణం


