
ఆర్టిజన్ కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలి
కోదాడరూరల్ : ఈ నెల 14 నుంచి చేపట్టనున్న విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలని టీవీఏసీ జేఏసీ(తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ) జిల్లా కన్వీనర్ కొండ నకులుడు పిలుపునిచ్చారు. సోమవారం కోదాడ పట్టణంలో సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. ఒకే వ్యవస్థలో రెండు రూల్స్ తీసుకురావడం అన్యాయమని స్టాడింగ్ ఆర్డర్స్‌ను రద్దు చేసి ఏపీఎస్ ఈబీ రూల్స్ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కన్వర్షన్ అనేది ఉద్యోగ భద్రత, ఆత్మగౌరవానికి సంబంధించిన అత్యంత కీలకమైన డిమాండ్ అని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్టిజన్ అని ఓ ముద్దు పేరు పెట్టి కార్మికులను నట్టేట ముంచి పోయిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆర్టిజన్ కార్మకులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్‌లతో సంబంధం లేకుండా సమ్మెలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్‌నగర్ డివిజన్ కన్వీనర్ పబ్బు మల్లయ్య, విడతల శ్రీనివాసరావు, సీహెచ్.రామచందు, బత్తిని రామారావు, సాయిచందు, సైదిరెడ్డి, లక్ష్మి ఉన్నారు.