
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
సూర్యాపేట : జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని టీయూసీఐ (ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా) జిల్లా అధ్యక్షుడు గొడ్డలి నర్సయ్య కోరారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకు కార్మికుల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వర్గ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9న జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని, ఈ సమ్మెలో టీయూసీఐ కార్యకర్తలు క్రియాశీలకంగా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా సహాయ కార్యదర్శి గోగుల వీరబాబు, జిల్లా నాయకులు శేషగిరి, సాహెబ్ హుస్సేన్, పుప్పాల అంజయ్య, మోహన్, వెంకన్న, యాదగిరి పాల్గొన్నారు.