
ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : పనిప్రదేశాల్లో లైంగిక వేధింపుల నివారణకు కార్యాలయాల్లో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ తేజస్ నంద్ పవార్ సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారం రోజుల్లో జిల్లా, మండల స్థాయి కార్యాలయాల్లో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేసి వారం రోజుల్లో సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు. కమిటీ ఏర్పాటు చేయకపోతే వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రజావాణిలో పరిష్కరించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ కొన్ని దరఖాస్తులు తిరిగి పరిశీలిస్తుందని, ఇందులో ఏమైనా తప్పులు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ వి.వి అప్పారావు, డీపీఓ యాదగిరి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, డీఈఓ అశోక్, సీపీఓ కిషన్, సంక్షేమ అధికారులు దయానంద రాణి, శంకర్, శ్రీనివాస నాయక్, జగదీశ్వర్ రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్