
కార్మికుల చట్టాలు, హక్కులను హరిస్తున్న కేంద్రం
సూర్యాపేట అర్బన్ : కేంద్ర ప్రభుత్వం కార్మికుల చట్టాలు, హక్కులను హరిస్తోందని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి ఆరోపించారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజా సంఘాల జిల్లా బాధ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణకు అప్పగించి కార్పొరేట్, పెట్టుబడిదారులకు ప్రయోజనం కలిగించే విధంగా లేబర్ కోడ్‌లలో చట్టాలను వారికి అనుకూలంగా మార్చారని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్‌లు అమలైతే కార్మికుల హక్కును కోల్పోతారన్నారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం రోజురోజుకు నిర్వీర్యం చేస్తోందన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెకు అన్ని ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ జూలై 3న జిల్లా కేంద్రంలో జరిగే కార్మిక, వ్యవసాయ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మడ్డి అంజిబాబు, గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా నాయకులు వీరబోయిన రవి, కడెం లింగయ్య, ఉప్పుల రమేష్ పాల్గొన్నారు.
ఫ తెలంగాణ రైతు సంఘం జిల్లా
అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి