పల్లెల్లో సా్థనిక జోష్
భానుపురి (సూర్యాపేట) : పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీలతో పాటు మున్సిపల్ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయన్న సంకేతాలు రావడం.. వీటిపై రెండు మూడు రోజులుగా పలువురు మంత్రులు ప్రకటన చేయడమే కాకుండా సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో రాజకీయ నాయకుల్లో హడావుడి నెలకొంది. స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసి దాదాపు ఏడాదిన్నర కావొస్తోంది. కేంద్రం నుంచి నిధుల విడుదల లేకపోవడంతో పల్లెల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. పలుమార్లు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందుకు వచ్చినా రిజర్వేషన్లు, తదితర కారణాలతో వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవడంతో ఇటు రాజకీయ నాయకులు, అటు అధికార యంత్రాంగం ఇక ఉరుకులు పరుగులు పెట్టనుంది. ఇక ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడొచ్చినా నిర్వహించేలా ఇప్పటికే అధికారులు సంసిద్ధంగా ఉన్నారు.
ఈ నెలాఖరులోగా షెడ్యూల్..?
పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జరిగే అవకాశముందని ప్రచారం జరిగింది. ఈ మేరకు అధికారులకు ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు రావడంతో దాదాపు ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేశారు. ఓటర్ల జాబితా, బ్యాలెట్ బ్యాకుల సేకరణ, ఎన్నికల నిర్వహణకు కావాల్సిన సిబ్బంది, బ్యాలెట్ పేపర్ల ముద్రణ తదితర ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈలోగా బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం తెరపైకి రావడం, కోర్టు పరిధిలోకి వెళ్లడం, ఎటూ తేలకపోవడంతో కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ప్రతిపక్షాల విమర్శలు, నిధుల కొరత, పల్లెల్లో నెలకొన్న సమస్యల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయితే మొదటగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించి.. ఆతర్వాతే గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరిపే అవకాశముంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ నిర్వహణకు దాదాపు ఈనెలాఖరు నాటికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చి జూలై రెండోవారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
యథాతథంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు
గత స్థానిక సంస్థల ఎన్నికల నాటికే జిల్లాలో 23 మండలాలు ఉన్నాయి. తదనంతరం కొత్త మండలాల ఏర్పాటు లేకపోవడంతో ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇక జిల్లావ్యాప్తంగా 475 గ్రామ పంచాయతీలతో గత ఎన్నికలు నిర్వహించగా.. ఇటీవల కొత్తగా 11 గ్రామపంచాయతీలు ఏర్పాటయ్యాయి. మొత్తంగా 486 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల వారీగా ఉన్న జనాభా ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. వాటిని కలెక్టర్ ఆధ్వర్యంలోనే ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తే ఈ జాబితా ఆధారంగానే రిజర్వేషన్లను ప్రభుత్వం ఆమోదించి జిల్లాకు పంపుతుంది. కేవలం జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్ మాత్రమే రాష్ట్రస్థాయిలో ప్రకటించనున్నారు.
ఫ ఎన్నికల నిర్వహణపై సీఎం
స్పష్టమైన సంకేతాలు
ఫ గ్రామాల్లో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయం
ఫ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న
ఆశావహులు
గ్రామపంచాయతీలు (పాతవి) : 475
(కొత్తవి) : 11
మొత్తం : 486
ఎంపీటీసీ స్థానాలు : 213
జెడ్పీటీసీ స్థానాలు : 23
పల్లెల్లో మొత్తం ఓటర్లు : 6,82,862
మహిళా ఓటర్ల సంఖ్య : 3,47,320
పురుష ఓటర్ల సంఖ్య : 3,35,542


