రైతు నేస్తం.. సాగుకు ఉపయుక్తం
నాగారం : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతునేస్తం పేరుతో సాగులో మెళకువలు, సలహాలు, సూచనలు అందిచేందుకు ప్రభుత్వం ఎంపిక చేసిన రైతు వేదికల్లో దృశ్య, శ్రవణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. పంట ఉత్పత్తులను పెంచే విధంగా నిపుణులు సలహాలు, సూచనలిస్తారు. అన్ని గ్రామాల రైతులు కార్యక్రమానికి హాజరై వీక్షించవచ్చు. మొదటి విడతగా మండలానికి ఒకటి చొప్పున 23 రైతు నేస్తం కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి మంగళవారం హైదరాబాద్ నుంచి పలువురు శాస్త్రవేత్తలు, జిల్లా వ్యవసాయాధికారులు, రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఆధునిక వ్యవసాయ విధానాలతోపాటు సస్యరక్షణపై సలహాలిస్తున్నారు. ఈ విధానం రైతులకు ప్రయోజనకరంగా ఉండడంతో మరిన్ని రైతు నేస్తం కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈనేపథ్యంలో అధికారుల ప్రతిపాదనల మేరకు తాజాగా కొత్తగా మండలానికి రెండు చొప్పున 46 కేంద్రాలు మంజూరయ్యాయి. వీటిని ఏర్పాటు చేసే ప్రక్రియలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎంపిక చేసిన రైతు వేదికల్లో సామగ్రి అమర్చాల్సిఉంది.
తక్కువ పెట్టుబడితో
అధిక దిగుబడులు సాధించేలా..
జిల్లాలోని 486 పంచాయతీల పరిధిలో 82 క్ల్లస్టర్లలో రైతు వేదికలు నిర్మించి వాటి ద్వారా పలురకాల సలహాలు ఇస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించి లాభాలు ఆర్జించే విధంగా రైతుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో రైతునేస్తం ఒకటి. దృశ్య, శ్రవణ సేవల విస్తరణకు వ్యవసాయంతో పాటు దానికి అనుబంధంగా ఉండే ఉద్యాన, మత్స్య, పట్టుపరి శ్రమ, పశుసంవర్ధక, నీటి పారుదల శాఖలకు సంబంధించి సలహాలు అందిస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
రైతు నేస్తం వేదికల్లో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖతో పాటు ఉద్యాన, పశు సంవర్ధక శాఖ అధికారులు అందుబాటులో ఉంటున్నారు. దీంతో కార్యక్రమానికి హాజరయ్యే రైతుల అన్నిరకాల సందేహాలు నివృత్తి అవుతున్నాయి. జిల్లాలో ఎంపిక చేసిన 46 గ్రామాల్లోని రైతు వేదికల్లో రైతు నేస్తానికి సంబంధించిన ఎలక్ట్రా నిక్ పరికరాలను ఏర్పాటు చేయిస్తున్నాము.
– జి.శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
ఫ అధిక దిగుబడులు సాధించేలా రైతు నేస్తం కార్యక్రమాలు
ఫ ఇప్పటికే 23 రైతువేదికల్లో కేంద్రాలు ఏర్పాటు
ఫ తాజాగా మరో 46 కేంద్రాలు మంజూరు
లక్ష్యాలివే..
రైతునేస్తం ద్వారా కర్షకులకు అధికారులు పలురకాల ప్రయోజనాలు చేకూరుస్తున్నారు. జిల్లాకు మంజూరైన రైతునేస్తం యూనిట్లను రైతు వేదికల్లో ఏర్పాటు చేస్తారు. బీఎస్‌ఎన్‌ఎల్ నెట్వర్క్ సాయంతో దృశ్య, శ్రవణ విధానం కొనసాగుతుంది. వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పిస్తారు. రైతునేస్తం నిర్వహణ మొత్తం ఏఈఓలకు అప్పగించారు. టీవీ, బ్యాటరీ తదితర విలువైన పరికరాలు కేంద్రాల్లో ఉంటాయి.
సందేహాల నివృత్తికి..
జిల్లాలోని రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా ఎరువుల యాజమాన్యం, వంగడాల ఎంపిక, కలుపు నివారణ, అధిక వర్షాల వేళ పంటల వారీగా తీసుకోవాల్సిన చర్యలు, సస్యరక్షణ చర్యలు వివరిస్తున్నారు. చిరుధాన్యాలు, వాణిజ్య పంటలు, కూరగాయల సాగు విధానాలను రైతులు అడిగి తెలుసుకొని, సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. కాలానుగుణంగా పశువులకు అందించాల్సిన టీకాల పై సంబంధిత శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు వచ్చే రాయితీలు, దరఖాస్తు విధానాలను వివరిస్తున్నారు. తాజాగా మరిన్ని రైతు నేస్తం కేంద్రాలను విస్తరించడంతో మరింత మంది రైతులకు సేవలు అందుబాటులోకి వచ్చే ఆస్కారముంది.
రైతు నేస్తం.. సాగుకు ఉపయుక్తం


