క్రమశిక్షణ రాహిత్యం సహించేది లేదు
హుజూర్‌నగర్ : ‘పంచాయతీ ఎన్నికల్లో గ్రామ, మండల స్థాయి నాయకుల అనైక్యత వల్ల కొంత ఇబ్బంది పడ్డాం.. నాయకుల్లో క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదు’ అని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (కాంగ్రెస్ బలపరిచిన) గెలిచిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమాన్ని శనివారం హుజూర్‌నగర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వారికి అభినందనలు తెలియజేస్తూ ఓడిన వారికి తన అండదండలు ఉంటాయన్నారు.గ్రామపంచాయతీల్లో అత్యధిక శాతం గెలిచామని ఓడిన చోట నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని సూచించారు. కొన్ని గ్రామాల్లో అభివృద్ధి చేసినా ఓడి పోయామని ఈ విషయాన్ని గమనించాలన్నారు. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పనులు చేపట్టడం సంతోషకరంగా ఉందన్నారు. బీడు భూములకు నీరందించేందకు పలు చోట్ల లిఫ్టులు, పేదలకు ఉన్నత విద్య అందించేందుకు జూనియర్, డిగ్రీ కాలేజీ బిల్డింగ్‌లు, ఐటీఐ, ఏటీసీ (అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్), యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఆధునికి వైద్య సదుపాయాలు కల్పించినట్లు వివరించారు.
అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు
సర్పంచ్‌లు కలిసిరావాలి
హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు నూతన సర్పంచ్‌లు అందరూ కలిసి రావాలని ఉత్తమ్ కోరారు. సర్పంచ్‌లు శాంతిభద్రతలు కాపాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని హితవుపలికారు. తొలి విడతగా కొత్త సర్పంచ్‌లకు గ్రామానికి 25 నుంచి 30 ఇళ్లను మంజూరు చేస్తున్నామని హామీ ఇచ్చారు. వాటిని అర్హులైనవారికి ఇవ్వాలని కోరారు. మరి కొన్నింటిని మార్చి, ఏప్రిల్‌లో మంజూరు చేస్తామన్నారు. తన జీవితంలో మరువలేని సంఘటన ఏదంటే రాష్ట్రంలోని పేదలకు సన్నబియ్యం పంపిణీని సీఎం చేతుమీదుగా హుజూర్ నగర్ నుంచి ప్రారంభించుకోవడం అని మంత్రి పేర్కొన్నారు.
ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


