10 నుంచి 13వరకు టీసీసీ పరీక్షలు
సూర్యాపేటటౌన్ : టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు(టీటీసీ)కు సంబంధించి లోయర్, హయ్యర్ డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ పరీక్షలు జనవరి 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ శనివారం ఒకప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి 12.30గంటల వరకు, మధ్యాహ్న 2 నుంచి 4.30గంటల వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. టైలరింగ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు వారి వెంట కుట్టు మిషన్ తీసుకొని రావాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్స్‌ను సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
23న గడ్డిపల్లి
కేవీకేలో కిసాన్ మేళా
గరిడేపల్లి: గరిడేపల్లి మండలం గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఈ నెల 23న కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు కేవీకే సీనియర్ సైంటిస్ట్, హెడ్ డి. నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, హైదరాబాద్‌లోని అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ జోన్ –10 డైరెక్టర్ షేక్ ఎన్. మీరా, శాస్త్రవేత్తలు హాజరుకానున్నట్లు వివరించారు. వివిధ కంపెనీల ఉత్పత్తులు, నూతన యాంత్రీకరణ పరికరాలు, క్షేత్రాల ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇందులో రైతులు, రైతు సంఘాలు, యువకులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
మట్టపల్లి హుండీల ఆదాయం రూ.16.35లక్షలు
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీలను నల్లగొండ ఏసీ కార్యాలయ సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి పర్యవేక్షణలో శనివారం లెక్కించారు. రూ.16,35,064 ఆదాయం వచ్చింది. వివరాలను ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూ రు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి స్థానికంగా విలేకరులకు వెల్లడించారు. 2025 సెప్టెంబర్ 9 నుంచి 19 డిసెంబర్ వరకు 101 రోజులకు సంబంధించి హుండీలను లెక్కించినట్లు తెలిపారు. ప్రధాన హుండీల ద్వారా రూ.15,25,604, అన్నదాన హుండీ ద్వారా రూ.1,09,460 ఇలా మొత్తం రూ.16,35,064లు ఆదాయం సమకూరినట్లు చెప్పారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ రామిశెట్టి విజయశాంతి అప్పారావు, అర్చకులు, ఆలయ సిబ్బంది, శ్రీసాయిసేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఎన్జీ కళాశాల పరీక్ష ఫలితాలు విడుదల
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ ఎన్జీ కళాశాల పరీక్ష ఫలితాలను ఎంజీ యూనివర్సిటీ సీఓఈ జి.ఉపేందర్‌రెడ్డి, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ఉపేందర్‌తో కలిసి శనివారం విడుదల చేశారు. 2025 నవంబర్‌లో డిగ్రీ మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాల్లో మూడవ సెమిస్టర్ 31శాతం, ఐదవ సెమిస్టర్ 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి.రవికుమార్, అంతటి శ్రీనివాసులు, సీఓఈ డి.మునిస్వామి, అకడమిక్ కోఆర్డినేటర్ బి.నాగరాజు, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, జే.నాగరాజు, అడిషనల్ కంట్రోలర్ ఎస్.వాసుదేవ్, ఎన్.వేణు తదితరులు పాల్గొన్నారు.
10 నుంచి 13వరకు టీసీసీ పరీక్షలు


