
ఖాకీకి అవినీతి మకిలీ!
పోలీస్ స్టేషన్‌లో ప్రతీ పనికి పోలీసుల వసూళ్లు
సూర్యాపేటటౌన్ : జిల్లాలో కొందరు పోలీస్ అధికారులు, సిబ్బంది తీరుతో ఆ శాఖ అప్రతిష్టపాలవుతోంది. ఏదైనా కేసులో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే పైసలు ఇవ్వందే పని కాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. న్యాయం చేయాల్సిన పోలీసులు ఇలా అడ్డదారులు తొక్కుతూ అవినీతి సొమ్ముకు కక్కుర్తి పడుతున్నారు. ఈ ఏడాది కాలంలో ఇప్పటికే ఒక కానిస్టేబుల్, ఇద్దరు ఎస్‌ఐలు ఏసీబీకి చిక్కారు. తాజాగా డీఎస్పీ, సీఐ ఏకంగా లక్షల్లో డిమాండ్ చేసి అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడడం కలకలం రేపుతోంది.
బెయిల్ ఇవ్వాలంటే..
నీతి, న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసులు లంచాలు డిమాండ్ చేస్తూ ఆ శాఖకు చెడ్డపేరుతెస్తున్నారు. ఏదైనా కేసు అయితే స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే రూ.వేలు, లక్షల్లో సదరు పోలీస్ అధికారికి ముట్టజెప్పాల్సిన దుస్థితి నెలకొంది. ఇటీవల ఏసీబీ వలలో చిక్కిన పోలీస్‌ల తీరు చూస్తుంటే అలానే ఉంది. డబ్బులు ఇస్తేనే బెయిల్ ఇస్తామని, లేదంటే బెయిల్ ఇవ్వకుండా రిమాండ్‌కు పంపిస్తామని బెదిరింపులకు సైతం పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు ముట్టజెప్పాల్సి ఉంటుందని చెప్పడం గమనార్హం.
ఏసీబీకి చిక్కిన కేసులు..
● ఈ ఏడాది జనవరి 12న కోదాడ నుంచి తిరుమలగిరి మీదుగా డీసీఎంలో రేషన్ బియ్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బియ్యం తరలిస్తున్న వారు సిద్దిపేట జిల్లా వడ్డెపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ పేరు చెప్పడంతో అతడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రశేఖర్ పేరు తొలగించడానికి అప్పటి తిరుమలగిరి ఎస్‌ఐ సురేష్ రూ.3లక్షలు లంచం డిమాండ్ చేయగా చివరకు రూ.1.40లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో జనవరి 28న తిరుమలగిరి ఎస్‌ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు రూ.70వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
● గత ఏడాది అక్టోబర్‌లో పౌరసరఫరాల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా చింతలపాలెం ఎస్‌ఐ అంతిరెడ్డి తన సిబ్బందితో కలిసి ఆరుగురిని పట్టుకుని వారిపై కేసు నమోదు చేశారు. ఇందులో ఒక నిందితుడిని పిలిపించుకొని అరెస్టు చేయకుండా స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే రూ.15వేలు డిమాండ్ చేసి రూ.10వేలకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ విషయంలో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులుఎస్‌ఐ అంతిరెడ్డిని ఏప్రిల్ 8న పట్టుకున్నారు.
ఫ బెయిల్ ఇవ్వాలంటే డబ్బులు ముట్టజెప్పాల్సిందే..
ఫ ఉన్నతాధికారులు వేటు వేస్తున్నా మారని తీరు
ఫ ఈ ఏడాది ఇప్పటికే ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎస్‌ఐలు, ఒక కానిస్టేబుల్
ఫ తాజాగా సోమవారం సూర్యాపేట డీఎస్పీ, పట్టణ సీఐ కూడా..
విధుల్లో చేరిన కొద్దికాలంలోనే..
ఈ ఏడాది ఏప్రిల్ 2న సూర్యాపేట డీఎస్పీగా పార్థసారథి , ఆరు నెలల క్రితం సూర్యాపేట పట్టణ సీఐగా వీరరాఘవులు బాధ్యతలు చేపట్టారు. వీరు విధుల్లో చేరిన అతి తక్కువ కాలంలోనే అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికారు. జిల్లాలో మెడికల్ మాఫియా రెచ్చిపోవడం.. ఇక్కడి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో హైదరాబాద్ నుంచి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం స్పందించింది. గత నెలలో సూర్యాపేటలోని పలు ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించగా అర్హత లేకుండానే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లు నడుపుతున్నట్లు నిర్ధారించింది. అర్హత లేకుండా డాక్టర్లుగా చలామణి అవుతున్న ఆపిల్ స్కానింగ్ సెంటర్, శ్రీ సాయిగణేష్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీ కృష్ణ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలంటూ ఐఎంఏ సభ్యులు గత నెల 29న పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయా నకిలీ డాక్టర్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేయకుండా ఉండాలంటే రూ.25లక్షలు ఇవ్వాలని డీఎస్పీ, సీఐ డిమాండ్ చేయగా అంత ఇవ్వలేనని చెప్పడంతో కనీసం రూ.16లక్షలైనా ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు బాధితుడు నల్లగొండలోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలతో సోమవారం పట్టుకున్నారు.
హయత్ నగర్‌లో సోదాలు
హయత్‌నగర్ లో డీఎస్పీ పార్థసారథి నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేసి అక్రమంగా ఉన్న 21 బుల్లెట్లను గుర్తించారు. దీనిపై అధికారులు హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లనుసైతం అధికారులు గుర్తించినట్టు సమాచారం.
ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నా..
ఇటీవల నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో చక్రయ్య అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సూర్యాపేట డీఎస్పీ రవిని డీజీపీ కార్యాలయానికి, తుంగతుర్తి సీఐ శ్రీనును జిల్లా పోలీస్ కార్యాలయానికి అటాచ్ చేశారు.
మట్టపల్లి చెందిన ఓ వ్యక్తి అమెరికాలో స్థిరపడ్డాడు. ఆ ఎన్నారై కారు మట్టపల్లిలోని ఆయన ఇంట్లో ఉందని తెలుసుకున్న ఎస్‌ఐ రామాంజనేయులు ఆయన సొంత అవసరాల కోసం వారం రోజుల పాటు కావాలని సంప్రదించి తీసుకున్నారు. రెండు నెలలవుతున్నా కారు ఇవ్వకపోవడంతో బాధితుడు పోలీస్ ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పలు అవినీతి ఆరోపణలతో పాటు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్‌ఐని సస్పెండ్ చేశారు.
గత ఏడాది తుంగతుర్తి, పెన్‌పహాడ్, ఆత్మకూర్.ఎస్‌లలో పని చేస్తున్న ముగ్గురు ఎస్‌ఐలు ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని వీఆర్‌కు అటాచ్ చేశారు. ఇలా ఇంకా కొంత మంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నా వారి తీరు మారకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.