
డీఎస్పీగా ప్రసన్నకుమార్ బాధ్యతల స్వీకరణ
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట డీఎస్పీగా ప్రసన్నకుమార్ బుధవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల్లో ఇక్కడ పని చేసిన డీఎస్పీ పార్థసారధి అరెస్టు అయిన విషయం విదితమే. ఆయన స్థానంలో సైబరాబాద్ ఏసీపీగా పని చేస్తున్న ప్రసన్నకుమార్ ఇక్కడికి బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించి డీఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు.
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
సూర్యాపేటటౌన్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 8,600 మంది పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం జిల్లాలో 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్‌కు ఒక సీఎస్, డీఓలను నియమించారు. జిల్లా కేంద్రంలో 8 పరీక్ష కేంద్రాలు, కోదాడలో ఐదు , హుజుర్‌నగర్‌లో రెండు, తుంగతుర్తిలో రెండు, మఠంపల్లి, నేరేడుచర్ల తిరుమలగిరి, నడిగూడెంలో ఒక్కొక్క పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష జరగనుంది.ఈ నెల 28వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీఐఈఓ భానునాయక్ తెలిపారు.
ట్రాక్టర్ల కిరాయిలు చెల్లిస్తాం
అర్వపల్లి: కొనుగోలు కేంద్రాల నుంచి ట్రాక్టర్లు ఏర్పాటు చేసి ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేస్తే కిరాయిలను చెల్లిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. బుధవారం జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని అర్వపల్లి, రామన్నగూడెంలోగల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఒక్కో ట్రాక్టర్‌కు కిరాయి రూ.300 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. వర్షాలు పడుతున్నందున కాంటాలైన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు పంపాలన్నారు. లారీల కొరత కూడా తీరనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ తహసీల్దార్ చిప్పలపల్లి యాదగిరి, గిర్దావర్‌లు రామరాజు జలేంధర్‌రావు, పాటి వెంకట్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ అశోక్ పాల్గొన్నారు.
రెండు ఆసుపత్రుల అనుమతులు రద్దు
సూర్యాపేటటౌన్ : చట్ట విరుద్ధంగా వైద్యం నిర్వహిస్తున్న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీసాయి గణేష్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీకృష్ణ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ అనుమతులను బుధవారం రద్దు చేసినట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీలలో చట్టవిరుద్ధంగా వైద్యం నిర్వహిస్తుండటంతో నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక వైద్యం బృందం తనిఖీలు నిర్వహించి, నివేదికను కలెక్టర్‌కు సమర్పించామని పేర్కొన్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం శ్రీ సాయి గణేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీకృష్ణ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ అనుమతులను ఎంక్వయిరీ కమిటీ ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం పూర్తిగా రద్దు చేసినట్లు వివరించారు.
క్రీడాప్రాంగణాల అభివృద్ధికి కలెక్టర్‌కు నివేదిక
నూతనకల్: జిల్లాలో క్రీడాప్రాంగణాల అభివృద్ధికి, నిధుల సమీకరణకు కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి రామచందర్‌రావు వెల్లడించారు. బుధవారం నూతనకల్ మండల కేంద్రంలో మినీ స్టేడియాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. మినీ స్టేడియాన్ని ఇతర కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారని ఇక నుంచి క్రీడలు తప్పా ఎలాంటి కార్యక్రమాలకు ఉపయోగించకూడదని ఆయన ఆదేశించారు. క్రీడా ప్రాంగణాన్ని భద్రత కోసం పంచాయతీ రాజ్, రెవెన్యూ అధికారులకు అప్పగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం. శ్రీనివాసరావు, ఆర్‌ఐ కర్ణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

డీఎస్పీగా ప్రసన్నకుమార్ బాధ్యతల స్వీకరణ