
జనార్దన్ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు
సూర్యాపేట : జలగం జనార్దన్ (జన్ను) సార్ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు చేస్తామని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. జలగం జనార్దన్ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం రోడ్డులోగల చంద్ర పుల్లారెడ్డి నగర్‌లో ఆయన విగ్రహాన్ని నర్సయ్య ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సంస్మరణ సభలో మాట్లాడుతూ జన్ను ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విప్లవ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనమన్నారు. దేశంలో మోదీ ఫాసిస్ట్ విధానాలతో ప్రశ్నించే ప్రతి ఒక్కరిని చిత్రహింసలకు గురి చేస్తూ ఎన్‌కౌంటర్లు చేస్తూ రాజ్యహింసను కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే మావోయిస్టులను, వారితోపాటు అమాయక గిరిజనులను పిట్టల్లా కాల్చి చంపుతున్నారని ఆరోపించారు. శాంతి చర్చలు చేద్దామని మేధావులు అన్ని రాజకీయ వర్గాలు ముందుకు వచ్చినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన ఆటవిక న్యాయాన్ని కొనసాగిస్తోందన్నారు. ఎన్‌కౌంటర్లు ఆపి చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ సూర్యాపేట జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గోకినపల్లి వెంకటేశ్వరరావు, సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్, పేర్ల నాగన్న, గొడ్డలి నరసన్న, వాసా పల్లయ్య, పీఓడబ్ల్యూ జిల్లా సహాయ కార్యదర్శి సూరం రేణుక, ఉపాధ్యక్షురాలు సంతోషి, ఐతరాజు పద్మ, సయ్యద్ , సయ్యద్ హుస్సేన్, వీరబాబు కట్టా రమేష్ గొడ్డలి లింగన్న పాల్గొన్నారు.
ఫ ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య