
71 వేల ఎకరాలకు సాగునీరు
హుజూర్‌నగర్, మేళ్లచెరువు : చింతలపాలెం మండలంలో కృష్ణానదిపై ఏర్పాటు చేసే మూడు ఎత్తిపోతల పథకాల ద్వారా వివిధ మండలాల్లోని దాదాపు 71 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం చింతలపాలెం పరిధిలోని అంజలి సిమెంట్ పరిశ్రమ ఆడిటోరియంలో మండలంలోని రాజీవ్‌గాంఽధీ, ఎంబీసీ, నక్కగూడెం ఎత్తిపోతల పథకాల పనుల పురోగతిపై కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌తో కలిసి ఇరిగేషన్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజీవ్‌గాంఽధీ, ఎంబీసీ, నక్కగూడెం ఈమూడు లిఫ్ట్‌ల ద్వారా దాదాపు 71వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. ఈ మూడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలకు సంభందించి భూ సేకరణను జూలై నాటికి పూర్తి చేసి పరిహారం చెల్లించాలని దేశించారు. 2008లో నక్కగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలు పెట్టి 2012 లో పూర్తి చేసి సాగునీరు అందజేశామని , 2018 నుంచి దీనికి మరమ్మతులు చేయించక పక్కన పెట్టడంతో రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. మళ్లీ మన ప్రభుత్వ హయాంలో రూ 37.70 కోట్లతో చేపట్టిన నక్కగూడెం లిఫ్టు పునరుద్ధరణ పనులను 2025నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. తద్వారా నక్కగూడెం, చింత్రియాల, కిష్టాపురం, తమ్మారం గ్రామాల్లో 3200 ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. రూ 1,450 కోట్లతో చేపట్టిన ఇందిరాగాంధీ ఎత్తిపోతల పథకం పనులు 2026 ఆగస్టునాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. దీని ద్వారా మఠంపల్లి మండలంలో 20,500 ఎకరాలు, మేళ్లచెరువులో 15,800 ఎకరాలు, చింతలపాలెం మండలంలో 16,700 ఎకరాలు సాగులోకి తీసుకొస్తామన్నారు. రూ. 394 కోట్లతో రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా మేళ్లచెరువు, కోదాడ, హుజూర్ నగర్, చింతలపాలెం, చిలుకూరు మండలాల్లోని 12 గ్రామాలలో 14,100 ఎకరాలు సాగులోకి తెస్తామన్నారు. 2026 మే నాటికి ఈలిఫ్ట్‌ను పూర్తి చేయాలన్నారు. ఈ మూడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు సంబంధించి భూ సేకరణకు రైతులు సహకరించాలని కోరారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఇరిగేషన్ సీఈ రమేష్ బాబు, ఎస్‌ఈ శివధర్మతేజ, ఆర్‌డీఓ శ్రీనివాసులు, ఈఈలు సత్యనారాయణ, రామకిషోర్, డీఈలు స్వామి, ఆనంద్, తహసీల్దార్ సురేందర్ రెడ్డి, ఎంపీడీఓ భూపాల్ రెడ్డి, ఏఈ కానుగ శ్రీనివాస్, జీవన్‌కుమార్, దుర్గయ్య, శ్రీనివాస్, నాగార్జున పాల్గొన్నారు.
ఫ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఫ రాజీవ్‌గాంధీ, ఎంబీసీ, నక్కగూడెం ఎత్తిపోతల పథకాలపై సమీక్ష