
పైరవీలతో పదవులు రావు
తిరుమలగిరి (తుంగతుర్తి) : ‘కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకే పదవులు వస్తాయి.. పైరవీలతో పదవులు రావు’ అని టీపీసీసీ పరిశీలకుడు, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ పేర్కొన్నారు. మంగళవారం తిరుమలగిరిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో ఇసుక మాఫియా, భూ మాఫియా సాగిందని పేర్కొన్నారు. మండల శాఖ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామ శాఖల అధ్యక్షుల పదవుల కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో 2017 సంవత్సరం కన్నా ముందున్న వారు, ఎన్నికల్లో గెలుపు కోసం పోరాడినవారు అర్హులవుతారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర :
మందుల సామేల్, ఎమ్మెల్యే.
త్యాగాల చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, పార్టీ అబ్జర్వర్ శత్రురావు, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అనురాధ, పీసీసీ అధికార ప్రతినిధి జ్ఞానసుందర్, తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, నాయకులు వై.నరేష్ ,యోగానందాచార్యులు, పాల్వాయి నాగరాజు, వివేక్‌రెడ్డి, కృష్ణప్రసాద్, పాలకుర్తి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నిరసన
సమావేశం ముగిసిన తరువాత టీపీసీసీ పరిశీలకుడు మురళీనాయక్, డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ కార్ల ముందు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ గెలుపు కోసం 30 సంవత్సరాలుగా కృషి చేశామని, తమకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో తమపై వందలాది కేసులు అయ్యాయన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మురళీనాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.
ఫ టీపీసీసీ పరిశీలకుడు మురళీనాయక్

పైరవీలతో పదవులు రావు