
రూ. 38 కోట్లు
ఎల్‌ఆర్‌ఎస్ రాబడి
● 25శాతం రాయితీతో ఐదు
మున్సిపాలిటీలకు భారీగా ఆదాయం
● 3వ తేదీతో ముగిసిన స్థలాల
క్రమబద్ధీకరణ గడువు
● అత్యధికంగా సూర్యాపేటకు రూ.21.07 కోట్లు.. అత్యల్పంగా
తిరుమలగిరికి రూ.1.28కోట్లు..
హుజూర్‌నగర్ : లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) ద్వారా మున్సిపాలిటీలకు భారీగా ఆదాయం సమకూరింది. 25శాతం రాయితీతో ఫీజు చెల్లించి నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ అవకాశాన్ని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకున్నారు. దీంతో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నిర్దేశిత గడువు ముగిసేనాటికి రూ.38.39 కోట్ల ఆదాయం సమకూరింది.
ఫీజు చెల్లించినవారు 12,654 మంది
జిల్లా వ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. హుజూర్‌నగర్, సూర్యాపేట, కోదాడ, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 65,476 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 59,135 దరఖాస్తులు ఫీజు చెల్లించేందుకు అర్హత పొందాయి. 12,654మంది అర్జీదారులు ఫీజులు చెల్లించారు. దీంతో మున్సిపల్‌శాఖకు రూ. 38.39 కోట్ల ఆదాయం సమకూరింది.
3వ తేదీతో ముగిసిన గడువు
ఎల్‌ఆర్‌ఎస్‌కింద 2020లో రూ. వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల క్రమబద్ధీకరణ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. దీనికి తోడు దరఖాస్తుదారుల ప్రయోజనం కోసం ఫిబ్రవరి 19 నుంచి వన్‌టైం సెటిల్‌మెంట్‌చేసిన వారికి 25శాతం ఫీజు రాయితీసైతం ప్రకటించింది. దీనికి మార్చి 31 వరకు గడువు విధించింది. ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి స్పందన రాలేదు. ఫీజు చెల్లించేందుకు గడువు తక్కువగా ఉండడంతో మరో మారు ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. ఆశించిన స్థాయిలో లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో మళ్లీ ఈనెల 3వ తేదీ వరకు గడువు పొడిగించగా అది కూడా ముగిసింది.
సూర్యాపేట మున్సిపాలిటీ టాప్
జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా వచ్చిన ఆదాయల్లో సూర్యాపేట టాప్‌లో నిలిచింది. సూర్యాపేట మున్సిపాలిటీకి అత్యధికంగా రూ. 21.07 కోట్లు రాగా తిరుమలగిరికి అత్యల్పంగా రూ.1.28కోట్ల ఆదాయం వచ్చింది.
ఆదాయం(రూ.కోట్లలో)
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణ వివరాలు
మున్సిపాలిటీ దరఖాస్తులు అర్హత ఉన్నవి ఫీజు చెల్లించినవి
సూర్యాపేట 35,632 31,939 6,710 21.07
కోదాడ 16,227 14,780 3659 12.07
హుజూర్‌నగర్ 4,424 3,474 826 2.43
తిరుమలగిరి 6,036 5,852 7661.28
నేరేడుచర్ల 3,157 3,090 693 1.54
మళ్లీ గడువు పొడిగిస్తే తెలియజేస్తాం
ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం పొడిగించిన గడువు ముగిసింది. ఇప్పటికే గడువు పొడిగించడం వల్ల పలువురు దరఖాస్తుదారులు తమ స్థలాలను క్రమబద్ధీకరించుకున్నారు. గడువును మరొక సారి పెంచాలని కొందరు కోరుతున్నారు. ప్రభుత్వం ఈ విషయమై ఆలోచన చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం గడువును పెంచిన వెంటనే తెలిజేస్తాం.
– కె. శ్రీనివాసరెడ్డి,
మున్సిపల్ కమిషనర్, హుజూర్‌నగర్