భావి శాస్త్రవేత్తలకు బంగారు బాటలు

- - Sakshi

సూర్యాపేటటౌన్‌ : పాఠశాలల స్థాయి విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతికతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మంచి అవకాశం కల్పిస్తోంది. విద్యార్థులకు స్పేస్‌ టెక్నాలజీ, స్పేస్‌ సైన్స్‌, స్పేస్‌ అప్లికేషన్స్‌పై ప్రాథమిక విజ్ఞానాన్ని పెంచేందుకు యువ విజ్ఞాని కార్యక్రమం(యువికా) నిర్వహిస్తుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

విద్యార్థులు ఎంపికై తే..

ఈ శిక్షణకు విద్యార్థులు ఎంపికై తే మే 15 నుంచి 26వరకు భారతదేశంలోని ఇస్రోకు సంబంధించిన ఏడు ప్రాంతాల్లో ఉన్న కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. రెసిడెన్షియల్‌ పద్ధతిలో జరిగే కార్యక్రమంలో ప్రయోగాత్మక ప్రదర్శన, ప్రముఖ శాస్త్రవేత్తల అనుభవాలను పంచుకోవడంతో పాటు చర్చా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. ఎంపికై న విద్యార్థితో పాటు తల్లిదండ్రుల్లో ఒకరికి లేదా గైడ్‌ టీచర్‌కు ప్రయాణ ఖర్చులను చెల్లిస్తారు. శిక్షణ అనంతరం శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌కు తీసుకెళ్లి అందులోని విశేషాలను ప్రత్యక్షంగా చూపిస్తారు.

ఆన్‌లైన్‌ ద్వారా..

విద్యార్థులు మొదట వారి ఈ మెయిల్‌ ఐడీతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 48గంటల్లో ఇస్రో ఏర్పాటు చేసే ఆన్‌లైన్‌ క్విజ్‌లో పాల్గొనాలి. క్విజ్‌ పూర్తయిన 60 నిమిషాల అనంతరం యువికా పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలు నమోదు చేసి ధ్రువీకరణ పత్రాలను జత చేయాలి. ఈ ప్రక్రియ ఈ నెల 20 నుంచి ప్రారంభం కాగా వచ్చే నెల 3వరకు అవకాశముంది. ఎంపిక జాబితాలను వచ్చే నెల 10న ప్రకటించి సమాచారమిస్తారు.

ఫ ఇస్రో ఆధ్వర్యంలో యువ విజ్ఞాని కార్యక్రమం

ఫ విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ఫ 9వ తరగతి చదివేవారికి అవకాశం

ఫ ఏప్రిల్‌ 3వ తేదీ వరకు గడువు

గ్రామీణ ప్రాంతాల వారికి..

ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. గ్రామీణ ప్రాంతాల వారికి మొదటి ప్రాధాన్యమిస్తారు. 8వ తరగతిలో పొందిన మార్కులు, గత మూడేళ్లలో వివిధ రకాల ప్రదర్శన పోటీల్లో (గుర్తింపు పొందిన క్రీడల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో) పాల్గొని మొదటి మూడు స్థానాల్లో నిలిచి ఉండాలి. గత మూడేళ్లుగా స్కౌట్‌, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌లలో సభ్యుడిగా ఉండాలి. ఆన్‌లైన్‌ క్విజ్‌లో ప్రతిభ చూపిన వారికి ప్రాధాన్యమిస్తారు.

విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలనే ఆసక్తి గల వారికి యువికా శిక్షణ మంచి అవకాశం. శాసీ్త్రయ అవగాహన, అంతరిక్ష పరిశోధన రంగాలపై ఈ శిక్షణ దోహదపడుతుంది. జిల్లాలో 9వ తరగతి చదివే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేలా ప్రధానోపాధ్యాయులు ప్రోత్సహించాలి.

– అశోక్‌, డీఈఓ

Read latest Suryapet News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top