అన్నను హత్య చేసిన తమ్ముడు

మరిపెల్లి నర్సయ్య (ఫైల్‌)  - Sakshi

గుండాల: మద్యం మత్తులో అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన మండలంలోని రామారం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రామారం గ్రామానికి చెందిన మరిపెల్లి అంజయ్యకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య లాలమ్మ కుమారుడు మరిపెల్లి నర్సయ్య(55) పుట్టిన తర్వాత అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో లాలమ్మ సొంత చెల్లెలు సుగుణమ్మను అంజయ్య రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. అంజయ్య మరణానంతరం సుగుణమ్మ గ్రామంలోనే తమ ఇంటి ఆవరణలో గుడిసె వేసుకుని అందులో నివసిస్తోంది. సుగుణమ్మ పెద్ద కుమారుడు గతంలోనే మృతిచెందగా, రెండో కుమారుడు మరిపెల్లి సాయికిరణ్‌కు 18 సంవత్సరాల క్రితం తిరుమలగిరి మండంలంలోని మొండ్రాయి గ్రామానికి చెందిన ధనలక్ష్మితో వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. కొంతకాలం వీరి కాపురం సాఫీగా సాగిన తర్వాత సాయికిరణ్‌ తాగుడుకు బానిసై జులాయిగా తిరుగుతూ నిత్యం భార్యను వేధించేవాడు. భర్త వేధింపులు భరించలేక ధనలక్ష్మి తన ఇద్దరు పిల్లలను తీసుకొని తల్లిగారింటికి వెళ్లింది. అప్పటి నుంచి సాయికిరణ్‌ నిత్యం తాగి వచ్చి తల్లి వద్దే గుడిసెలో ఉంటున్నాడు. అంజయ్య మొదటి భార్య కుమారుడు నర్సయ్యకు భార్య అంజమ్మ, కుమారుడు వెంకటేష్‌, ఇద్దరు కుమార్తెలు సంతానం. ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు చేశాడు. నర్సయ్య బతుకుదెరువు కోసం భార్య, కుమారుడితో కలిసి చైన్నె వలస వెళ్లి, కరోనా సమయంలో తిరిగి సొంత గ్రామానికి వచ్చి కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కరోనా తర్వాత నర్సయ్య భార్య, కొడుకు తిరిగి చైన్నె వెళ్లిపోగా, అతడు మాత్రం ఇక్కడే ఉంటున్నాడు. ఇటీవల నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. కాగా సోమవారం రాత్రి నర్సయ్య ఇంట్లో తమ్ముడు సాయికిరణ్‌తో కలిసి మద్యం సేవిస్తూ భోజనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ‘నీ భార్యను కాపురానికి తీసుకొచ్చి పిల్లలను జాగ్రత్తగా చూసుకో..’ అని సాయికిరణ్‌కు నర్సయ్య సూచించాడు. ‘నా కుటుంబం నా ఇష్టం.. నువ్వు నాకు ఏమీ చెప్పొద్దు’ అని సాయికిరణ్‌ నర్సయ్యతో గొడవకు దిగాడు. వీరిద్దరి మధ్య మాటామాట పెరగడంతో కోపోద్రిక్తుడైన సాయికిరణ్‌ ఇంటి బయట ఉన్న బోరు మోటార్లను ఊడదీసే పానతో నర్సయ్య తలపై బలంగా కొట్టాడు. దీంతో నర్సయ్య తల పగిలి రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతుండగా నిందితుడు 100కు డయల్‌ చేసి తన అన్నను కొట్టినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడి పెద్ద కుమార్తె ఎలిమినేటి జానకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆలేరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఫ మద్యం మత్తులో ఘాతుకం

ఫ పోలీసులకు సమాచారం ఇచ్చి

లొంగిపోయిన నిందితుడు

ఫ గుండాల మండలంలోని రామారం గ్రామంలో ఘటన

Read latest Suryapet News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top