ఏడాదంతా... ఏ చింత లేకుండా..! | - | Sakshi
Sakshi News home page

ఏడాదంతా... ఏ చింత లేకుండా..!

Apr 16 2026 12:05 PM | Updated on Apr 16 2026 12:05 PM

● ఏజెన్సీ చింతపండుకు

వినియోగదారుల క్యూ

● ఏడాదంతా నిల్వ ఉండేలా ఏర్పాట్లు

ఒకేసారి కొనుగోలు చేస్తాం

ప్రతిఏటా సీజన్‌ ఏజెన్సీకి వచ్చి మాకు, మా బంధువులకు సరిపడిన చింతపండును ఒకేసారి కొనుగోలు చేస్తాం. చింతపండుకు పిక్కతీసి, బాగా శుభ్రపరిచిన అనంతరం హైదరాబాద్‌ తో పాటు పలు పట్టణాల్లో ఉన్న మా బంధువులకు పంపిస్తుంటాము. – జి.శారద, కొత్తూరు

కష్టమే మిగులుతోంది

ఏడాది మొత్తం చింతపంటను నమ్ముకొని ఉంటాము. ప్రమాదకరమైన చెట్లు ఎక్కి చింతబొట్లను చెట్టు నుంచి తీయడం జరుగుతుంది. తీసిన బొట్టలు నుంచి చింత పండును వేరు చేయడానికి రోజులు తరబడి కష్టపడతాము. కానీ తగిన ధరలు లభించడం లేదు.

– సవర సుంకయ్య, కొత్తూరు

కొత్తూరు: ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో చారు లేకుండా భోజనం ఉండదు. నిత్యం వంటింట్లో ఏదో రకంగా చింతపండు వినియోగం ఉంటుంది. అలాగే పచ్చళ్ల తయారీకి సైతం అత్యంత కీలకంగా చింతపండును పేర్కొంటున్నారు. అలాంటి నాణ్యమైన చింతపండుకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు, సీతంపేట, భామిని మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు ప్రసిద్ధిగాంచాయి. వేసవి సమీపిస్తున్న తరుణంలో మైదాన ప్రాంతం వ్యాపారులతో పాటు కొనుగోలుదారులు సంతల్లో గిరిజనులు విక్రయించే చింతపండు కోసం క్యూ కడుతుంటారు. అధిక మొత్తంలో కొనుగోలు చేసి ఏడాదంతా వినియోగించడం, అమ్మకాలు సాగిస్తుండడం పరిపాటిగా మారింది.

ఏజెన్సీ చింతపండుకు గిరాకీ

జిల్లాలో ఏజెన్సీ చింతపండుకు అత్యంత గిరాకీ ఉంది. ఇక్కడి గిరిజనులు ఆటవీ ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద చింత చెట్లు వద్ద చింతపండును సేకరిస్తారు. దీని రుచి వేరుగా ఉంటుంది. ఇక్కడ లభ్యమయ్యే చింతపండుతో తయారు చేసిన పచ్చళ్లు. చారు, పులుసు తదితర వంటకాలు మంచి రుచిని కలిగి ఉంటాయి. అందుకే ఒకేసారి అధిక మొత్తంలో కొనుగోలు చేసి వివిధ రకాల పద్ధతుల్లో నిల్వ ఉంచుకొని ఏడాదంతా వినియోగించడంతో పాటు.. పట్టణాల్లో ఉండే బంధువులు, స్నేహితులకు పంపిస్తామని కొనుగోలుదారులు చెబుతున్నారు. ఇకపోతే పంట దిగబడిని బట్టి ధర ఆధారపడుతుంది. ఈ ఏడాది పంట తక్కువ ఉండడంతో పాటు ఇతర జిల్లాల నుంచి వ్యాపారులు సంతలకు ఎక్కువ మంది రావడంతో కిలో రూ.75 లు నుంచి రూ.80లు ధర ఉంది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని కొనుగోలుదారులు చెబుతున్నారు.

నిల్వచేసే విధానం

సాధారణంగా ఏజెన్సీలోని సంతల్లో గిరిజనుల వద్ద వినియోగదారులు కొనుగోలు చేస్తారు. చింతపండుకు ఉన్న పెంకులు, ఇతరాలను వేరుచేసి శుభ్రపరుస్తారు. పల్లె ప్రాంతాల ప్రజలు కేజీ నుంచి రెండున్నర కేజీల పరిమాణంలో ఉప్పు వేసి గోళాకారంగా ఉండలను చేసి ఎండబడతారు. ఎండిన తర్వాత ఉండలను మట్టి, ప్లాస్టిక్‌ బకెట్లలో ఏడాదంతా ఉంచుకొని వినియోగిస్తారు. పట్టణ ప్రజలైతే పై ప్రక్రియ మాదిరిగానే చేసి ప్రత్యేక కవర్లలో, ఫ్రిడ్జ్‌లలో పెట్టి ఏడాదంతా నిల్వ ఉంచి వినియోగిస్తారు

– నష్టపోతున్నాం

ప్రస్తుతం చింతపండు నిల్వ చేసేందుకు శీతల కేంద్రాలు లేకపోవడంతో దళారీలు అడిగిన ధరకు విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో తీవ్రంగా నష్టపోతున్నాము. అధికారులు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తే మాకు మేలు జరుగుతుంది.

– నిమ్మక అప్పన్న, గొట్టిపల్లి, కొత్తూరు

Advertisement
 
Advertisement
Advertisement