● జంక్ ఫుడ్‌తో చిన్నారులకు అనారోగ్యాలు
● ప్యాకింగ్ పదార్థాలతో అపాయం
● సంప్రదాయ సమతుల్య ఆహారంతో మేలు
అవగాహన కల్పిస్తున్నాం
పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు జంక్ ఫుడ్ మాన్పించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లో ఉండే ఆహార పదార్థాల వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సంప్రదాయ ఆహార పదార్థాలు తయారు చేసి పిల్లలకు అందివ్వాలి. దీనివలన వారిలో శారీరక, మానసిక ఎదుగుదల ఉంటుంది. – విద్యా శతపతి, సీడీపీవో, టెక్కలి
జంక్‌ఫుడ్‌తో అనారోగ్య సమస్యలు
జంక్ ఫుడ్ వలన చిన్నారుల్లో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం, గుండె, పొట్ట సమస్యలతో పాటు మెదడు ఎదుగుదల లేకుండా చేస్తాయి. జంక్‌ఫుడ్ ఆకర్షణకు గురి కాకుండా చూసుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – బీఆర్‌కే మహారాజ్, చిన్న పిల్లల వైద్య నిపుణుడు, టెక్కలి జిల్లా ఆస్పత్రి
ఎదుగుదలకు హానికరం
చిన్నారుల ఎదుగుదలపై ఈ జంక్ ఫుడ్స్ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ఎక్కువ క్యాలరీలు, చక్కెర, ఉప్పు ప్రభావంతో వారిలో రోగ నిరోధక శక్తి నశించి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. వీటిలో ఎటువంటి ప్రోటీన్లు, విటమిన్లు ఉండవు. దీనివల్ల పెరుగుదల, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. బర్గర్లు, పిజ్జా, చిప్స్, సోడాల్లో పోషకాలు తక్కువ, క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. దీంతో శరీరం పోషక లోపంతో ఎదుగుతుంది. అధిక బరువు, గుండె, లివర్ సమస్యలకు దారి తీస్తాయి. ఎక్కువ చక్కెర, ఫ్యాట్స్ వలన స్థూలకాయం, మధుమేహపు ప్రమాదం, ఫాటీ లివర్ మొదలైన సమస్యలు చిన్న వయసులోనే వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఏకాగ్రత తగ్గి, చిరాకు, అలసట, నిద్రలేమి సమస్యలు వస్తాయి.
తల్లిదండ్రుల్లో మార్పు రావాలి
చిన్నారులకు జంక్ ఫుడ్‌ను మాన్పించే విషయంలో తల్లిదండ్రుల నుంచి మార్పు రావాలి. ఇంట్లో తల్లిదండ్రుల ఆహార అలవాట్లుకు అనుగుణంగా పిల్లల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే విషయంలో ఆకర్షణీయంగా ఇంట్లోనే పదార్థాలను తయారు చేసి వారికి అందివ్వాలి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఆహారాన్ని తయారు చేయడంలో పిల్లలు భాగస్వామ్యం ఉండే విధంగా చూడాలి. దీనివలన వారు తయారు చేసిన ఆహారాన్ని ఎలాగైనా తినాలి అనే మార్పు వస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినే విషయంలో వారిని ప్రోత్సహించే విధంగా చిన్నపాటి ప్రోత్సాహకాలు అందజేయాలి. దీనివలన ఆరోగ్యకరమైన ఆహారంపై ఆసక్తి పెరుగుతుంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్ ఆహారం అనారోగ్యం అనే విషయంపై చిన్నారులకు అవగాహన కల్పించాలి.
సంప్రదాయ ఆహారంతో మేలు
చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు కొన్ని రకాల సాంప్రదాయ ఆహారాలను అలవాటు చేయాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఇంట్లో వండిన సమతుల్య ఆహారం అనగా పప్పు, కూరలతో చేసిన ఆహారం, పాలు, గుడ్లు, చికెన్, చేపలు వంటి ప్రోటీన్ ఆధారిత ఆహారం వారి పెరుగుదలకు ఎంతో మంచిది. వీటితో పాటు పండ్లు, కూరగాయలు, అరటి, పచ్చి కూరలు, క్యారట్, బీట్రూట్‌తో చేసిన ఆహార పదార్థాలతో విటమిన్లు, ఖనిజ లవణాలు లభిస్తాయి.


