శ్రీకాకుళం పాతబస్టాండ్: విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో నిర్వహిస్తున్న వసతి గృహంలో చేరేందుకు చలన సంబంధ, బధిర విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థినులను ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ ఏడీ శైలజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వసతి గృహంలో 50 మంది విభిన్న ప్రతిభావంతులైన బాలికలు చేరేందుకు అవకాశం ఉందన్నారు. 1వ తరగతి నుంచి పోస్టు గ్రాడ్యూయేషన్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచిత భోజనం, వసతితో పాటు పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, సంవత్సరానికి నాలుగు జతలు యూనిఫామ్స్, కాస్మోటిక్ చార్జీలకు గానూ ప్రతినెల రూ.250లు అందజేయనున్నట్లు వెల్లడించారు. అలాగే పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న, ఉపాధి శిక్షణ పొందుతున్న విభిన్న ప్రతిభావంతులైన బాలికలకు సైతం శిక్షణ కాలములో వసతి గృహంలో వసతి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వసతి గృహంలో చేరే విద్యార్థినుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలని, వికలాంగత్వం 40 శాతం కానీ అంతకంటే ఎక్కువ గానీ ఉండాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రం(ఓసీలకు అవసరం లేదు) ఉండాలని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు 08942–240519, 99519 71764, 80747 77210 నంబర్లను సంప్రందించాలని సూచించారు.
అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
టెక్కలి: అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. స్థానిక పట్టుమహదేవి కోనేరు గట్టుపై ఆలయం అభివృద్ధి పనులకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం అన్న క్యాంటిన్‌ను ప్రారంభించారు. అలాగే స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అంతకుముందు కోటబొమ్మాళిలో పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఆయనతో పాటు ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, ఏఎంసీ చైర్మన్ బి.శేషగిరి, నాయకులు కె.హరివరప్రసాద్, వి.విజయలక్ష్మి, ఎం.సుందరమ్మ, ఎం.దమయంతి తదితరులు ఉన్నారు.
గాయత్రీలో మెరిట్
స్కాలర్ షిప్ టెస్ట్
శ్రీకాకుళం రూరల్: గాయత్రీ కాలేజ్ ఆఫ్ సైన్సు అండ్ మేనేజ్‌మెంట్ కళాశాలలో డిగ్రీ ప్రవేశం పొందాలనుకునే విద్యార్థుల కోసం 2026–27 విద్యా సంవత్సరం నుంచి మెరిట్‌స్కాలర్ షిప్ ఇవ్వనున్నట్లు గురజాడ విద్యాసంస్థల అధినేత జీవీ స్వామినాయుడు బుధవారం తెలిపారు. మే 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతీ 100 మందిలో ఉత్తమ మార్కులు సాధించిన 5 మందికి రూ.25 వేల ప్రతిభా పురస్కారం అందజేస్తామన్నారు. ఈ పరీక్ష అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ స్టడీస్ వంటి అంశాలపై ఉంటుందన్నారు. పరీక్ష కోసం ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. మరిన్ని వివరాలకు 94403 95109 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఆయనతో పాటు కరస్పాండెంట్ రంగారావు, ప్రిన్సిపాల్ కేవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


