ఇచ్ఛాపురం రూరల్: ఉపాధి హామీ పథకంలో భాగంగా గతంలో వేతనదారులకు ఇచ్చిన మొక్కలు ఇప్పుడు సామాజిక తనిఖీ బృందానికి దొరకడం లేదు. మొక్కలు నాటినట్లు రికార్డుల్లో ఉన్నా.. లెక్కకు మాత్రం అక్కడ ఒక్క మొక్క కూడా సామాజిక తనిఖీ బృందాలకు చిక్కకపోవడం విశేషం. 2024–25 ఆర్థిక సంవత్సరానికి 1,252 పనులకు గత నెల రోజులుగా సామాజిక బృందం సభ్యులు గ్రామాల్లో ఆడిట్ నిర్వహించారు. వేతనాల రూపంలో రూ.10.75 కోట్లు, మెటీరియల్ రూపంలో రూ.5.14 కోట్లకు సామాజిక తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో బుధవారం నిర్వహించిన ప్రజావేదికలో మండలంలోని ఏ గ్రామంలో కూడా మొక్కలు లేకపోవడంతో పీడీ లవరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మొక్కలు నాటాలని ఆదేశించారు. బాలకృష్ణాపురంలో రూ.1.05 లక్షల ఖర్చుతో నీటి కుంట తవ్వారు. అయితే జేసీబీతో కప్పివేసినట్లు సామాజిక బృందం గుర్తించింది. అదే గ్రామంలో రూ.5.38 లక్షలతో నక్కల బంధ చెరువు పూడిక తీత పనులు చేపట్టారు. అయితే ఆ చెరువు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆక్రమించి చెరువు గట్టును పూర్తిగా తొలగించి, గ్రావెల్ రోడ్డు వేసి స్థలాలుగా మార్చుకున్నట్లు సామాజిక తనిఖీలో బృందం గుర్తించింది. దీనిపై ఏపీడీ ఎంకై ్వరీ వేస్తున్నట్లు పీడీ లవరాజు ఆదేశించారు. వివిధ కారణాలతో ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.4,500ల జరిమానా విధించారు. కార్యక్రమంలో ఎంపీపీ బోర పుష్ప, పీఏసీఎస్ చైర్మన్ పెదిన బాబ్జీ, డ్వామా పీడీ బి.లవరాజు, ఏపీడీ పి.రాధ, ఏపీడీ సీహెచ్ శ్రీనివాసరెడ్డి, విజిలెన్స్ అధికారి శ్రవణ్‌కుమార్, ఎంపీడీవో ఎ.ప్రభాకరరావు, ఎస్‌ఆర్పీ సిర్ల మాధవరావు, ఏపీవో పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.


