కవిటి: మండలంలోని ఉపాధి హామీ పథకానికి సంబంధించి నిర్వహించిన 18వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక తూతూమంత్రంగా జరిగింది. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు జరిగిన పనులకు సంబంధించి ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక సభ బుధవారం కవిటిలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.లవరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. వాస్తవానికి సామాజిక తనిఖీ ఆడిట్ బృందం ఫిబ్రవరి 11 నుంచి మార్చి 31 వరకు గ్రామస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ గ్రామస్థాయి సభలకు సంబంధించి మీడియా, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడంలో తనిఖీ బృందం ఆసక్తి చూపకపోవడం గమనార్హం. వేజ్ కాంపోనెంట్ రూ.10.56 కోట్లకు పైగా నిధులు, పీఆర్ విభాగంలో రూ.4.10 కోట్లు, సోషల్ ఫారెస్ట్రీలో రూ.97,713లు, కాంపౌండ్స్ రూ.1.14 లక్షలకు సంబంధించిన పనులపై ఈ తనిఖీ నిర్వహించారు. సమీక్ష ప్రారంభం అయిన గంటలోనే 5 పంచాయతీలకు సంబంధించిన సానుకూల, ప్రతికూల అంశాలకు సంబంధించిన చర్చ సోషల్ ఆడిట్ సిబ్బంది పూర్తి చేసేశారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.15 కోట్ల నిధులు వినియోగానికి సంబంధించి కేవలం రూ.20,500లు దుర్వినియోగం అయినట్లు అధికారులు తేల్చారు. ఈ నిధులు బెజ్జిపుట్టుగలో రూ.6,000లు, సహలాలపుట్టుగలో రూ.7,500లు, బల్లిపుట్టుగలో రూ.4,500లు, వరకలో రూ.2,500లుగా నిర్దారించారు. కార్యక్రమంలో అడిషనల్ పీడీ టి.రాధ, ఏపీడీ సీహెచ్ శ్రీనివాసరెడ్డి, హెచ్‌ఆర్ మేనేజర్ శ్రావణ్, ఎంపీడీవో ఎల్.త్రినాథ, ఏపీవో టి.మోహనరావు, ఈసీ నీలాంబర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.


