న్యూస్‌రీల్
చిట్టచివరన సిక్కోలు
● ఇంటర్మీడియెట్ ఫలితాల్లో అట్టడుగు స్థానాల్లో నిలిచిన శ్రీకాకుళం
● జిల్లా సగటుతో పోలిస్తే వెనుకబడిన ప్రభుత్వ యాజమాన్య కళాశాలలు
● ప్రభుత్వ హడావుడి నిర్ణయాలు, ఏకపక్ష వైఖరే కారణమంటున్న విశ్లేషకులు
చిన్నారుల ఆరోగ్యాన్ని జంక్‌ఫుడ్ దెబ్బతీస్తోంది. ప్యాకింగ్ పదార్థాలు తీవ్ర అనారోగ్యాన్ని కలగజేస్తున్నాయి. –8లో
గురువారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
మే 21 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు..
ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు జరుగుతాయి. ప్రధాన పరీక్షలు జూన్ 2తో ముగుస్తాయి. ఉదయం మొదటి సంవత్సరం, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. ఫెయిలైన విద్యార్థులు, మార్కులు ఇంప్రూవ్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు పరీక్షలకు సమాయత్తం కావాలి. ఏప్రిల్ 20 నుంచి 27 వరకు పరీక్ష ఫీజులను కాలేజీల్లోనే చెల్లించాలి. రీ–కౌంటింగ్, రీ–వెరిఫికేషన్‌కు నిర్దేశిత ఫీజులు చెల్లించి, కాలేజీల్లో దరఖాస్తులు చేసుకోవాలి.
– రేగ సురేష్‌కుమార్, జిల్లా ఆర్‌ఐఓ/డీవీఈఓ
(ప్రస్తుత ఫలితాలు)
శ్రీకాకుళం న్యూకాలనీ:
ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు తీవ్రంగా నిరాశపరిచారు. బుధవారం వెలువడిన ఫలితాల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతంతోపాటు రాష్ట్రస్థాయిలోనూ వెనుకబడ్డారు. గత ఏడాది 74 శాతం సాధించగా.. ఈ ఏడాది ఒకశాతం దిగజారి 73కి చేరింది. ఇక ఎప్పటిలాగే ఈ సారి కూడా బాలురు కంటే బాలికలే పైచేయి సాధించారు. జిల్లాలో 71 కేంద్రాల్లో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వ తేదీ వరకు 23రోజులపాటు పరీక్షలు జరగగా.. స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 తేదీ వరకు కొనసాగిన విషయం తెలిసిందే.
ఫస్టియర్‌లో 70 శాతం..
ప్రథమ సంవత్సరం విద్యార్థులు గత ఏడాదితో కాస్త పోలిస్తే మెరుగనిపించారు. గత ఏడాది జనరల్ కోర్సులలో 63 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 70 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో 21వ స్థానంలో నిలిచారు. 17,432 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకాగా.. 12,163 మంది ఉత్తీర్ణులయ్యారు.
సెకెండియర్‌లో 73 శాతం..
సీనియర్ ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్ధులు గత ఏడాది కంటే ఒక శాతం దిగజారి 74 శాతం నుంచి 73 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌లో మాత్రం ముందు వరుసలో నిలిచారు. జనరల్ కోర్సుల పరీక్షలకు 17,355 మంది హాజరుకాగా, 12,684 మంది పాసయ్యారు.
సర్కారు వెనుకంజ..
గత ఏడాది వరకు మెరుగైన ఉత్తీర్ణత సాధిస్తూ వచ్చిన ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కళాశాలలు తాజా ఫలితాల్లో వెనుకబడ్డాయి. జిల్లా సగటు ఉత్తీర్ణతతో పోలిస్తే సర్కారీ కళాశాలల ఫలితాలు తగ్గుముఖం పట్టాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన హడావుడి నిర్ణయాలు, కనీస అభిప్రాయ సేకరణ, దిగువ స్థాయిలో అధికారులతో సమీక్షలు, సమావేశాలు లేకుండా తీసుకొచ్చిన ఏకపక్ష విధానాలే కారణామనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా క్లాసులు నిర్వహించకుండా వారోత్సవాలు, పేరెంట్స్ మీటింగ్స్ పేరిట 15 రోజులు, జీఎస్టీ వారోత్సవాలు, వినియోగదారుల వారోత్సవాలు, రాజ్యాంగ ఆమోదం, జాతీయ సేవా పథకం దినోత్సవం, ర్యాలీలు, ప్రతినెల స్వర్ణాంధ్ర–స్వచ్ఛంధ్రా పేరిట పరిసరాల పరిశుభ్రత, ఒకటేంటి.. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలతో విద్యార్థులకు క్లాసులు లేకుండా చేయడంతో తమకు పాఠాలు చెప్పే అవకాశం లేకుండా పోయిందని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు ఆదేశాలతో కార్యక్రమాలను జరపాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. పాఠశాలల్లో జరిగే కార్యక్రమాలన్నీ కాలేజీల్లో అమలుచేస్తూ అధ్యాపకులు పాఠాలకు నోచుకోలేదని.. ఈ విషయంలో తాము కూడా ఏమీ చేయలేకపోయామని ప్రిన్సిపాళ్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వెరసి ప్రభుత్వ యాజమాన్య కాలేజీల్లో పూర్తిస్థాయిలో క్లాసులు జరగలేదనే సర్వత్రా అంగీకరిస్తున్నారు.
సత్తాచాటిన గురుకులాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఫస్టియర్‌లో 566 మంది విద్యార్థులకు గాను 496 మంది ఉత్తీర్ణులయ్యారు. 88 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎల్.గోవింద్ (బైపీసీ) 440, లింగాల రేష్మ, పొట్నూరు చరణ్‌కుమార్ (ఎంపీసీ) 462, టి. దీపిక (సీఈసీ) 456, మార్కులతో ప్రతిభ చాటారు. సెకెండియర్‌లో 591 మందికి గాను 517 మంది పాసై 87 శాతం ఉత్తీర్ణత సాధించారు. అల్లాడ సోనియా (బైపీసీ) 977, కొప్పిలి జగదీష్ (ఎంపీసీ) 973, కోనారి గీతాలక్ష్మి (సీఈసీ)850 మార్కులతో సత్తాచాటారు. వీరితో పాటు అధ్యాపక బృందాన్ని జిల్లా కో–ఆర్డినేటర్ వై.యశోదలక్ష్మి అభినందించారు.
సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని వసతి గృహాల్లో ఫస్టియర్‌లో 67 శాతం, సెకెండియర్‌లో 70 శాతం ఉత్తీర్ణత సాధించారు.
బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 18 వసతి గృహాల నుంచి ఫస్టియర్‌లో 571 మంది హాజరుకాగా 381 మంది ఉత్తీర్ణులయ్యారు. 66.73 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకెండియర్‌లో 468 మంది హాజరు కాగా, 326 మంది పాసయ్యారు. 69.66 శాతం పలితాలు సాధించారు.


